బీసీ రిజర్వేషన్ల సాధన ఉద్యమానికి సిద్ధం కావాలి..దసరాలోపు అమలు చేయకుంటే పోరాటం తప్పదు

బీసీ రిజర్వేషన్ల  సాధన ఉద్యమానికి సిద్ధం కావాలి..దసరాలోపు అమలు చేయకుంటే పోరాటం తప్పదు
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

తొర్రూరు, వెలుగు : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీలు రాజకీయ ఉద్యమానికి సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌గౌడ్‌‌ పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌‌ జిల్లా తొర్రూరులో బుధవారం మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు నోటితో మద్దతు ఇస్తూ.. నొసటితో వెక్కిరిస్తున్నాయని మండిపడ్డారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు.. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు. పార్లమెంట్‌‌లో చట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేశారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నాయకులు కేంద్రానికి కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదని, వారి కుట్రను బీసీలు అర్థం చేసుకున్నారన్నారు. రాజకీయ పార్టీలన్నీ బీసీ రిజర్వేషన్‌‌ బిల్లుకు మద్దతు ఇచ్చి ఆమోదం తెలిపేలా కృషి చేయాలని కోరారు. తొమ్మిది శాతం ఉన్న అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసినప్పుడు, 60 శాతం జనాభా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేరని ప్రశ్నించారు. 

దసరాలోపు రిజర్వేషన్లు అమలు చేయకుంటే లక్షల మంది బీసీలతో భువనగిరిలో బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైరి రవికృష్ణ, కేయూ ప్రొఫెసర్‌‌ సంగిని మల్లేశ్వర్‌‌, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదగాని సోమయ్య, జిల్లా అధ్యక్షుడు గుండగాని వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు ప్రభాకర్, జిల్లా యూత్‌‌ అధ్యక్షుడు బసనబోయిన మురళీయాదవ్, నాయకులు తాళ్లపల్లి బిక్షంగౌడ్, నిమ్మల వెంకన్న గౌడ్, బొమ్మనబోయిన వెంకన్న యాదవ్ పాల్గొన్నారు.