- నల్గొండలో 24, యాదాద్రిలో పది తగ్గినయి యాదాద్రిలో మహిళలకు 14 తగ్గినయి
- ఎస్టీలకు రెండు, ఎస్సీలకు 8, అన్ రిజర్వ్‌డ్‌కు ఆరు పెరిగినయ్
యాదాద్రి, నల్గొండ, వెలుగు : జిల్లాలో 2019 ఎన్నికల కంటే ఈసారి పంచాయతీ రిజర్వేషన్ల కేటాయింపులో బీసీలకు, కొన్ని చోట్ల మహిళలకు సీట్లు తగ్గాయి. ఎస్సీ, ఎస్టీ, అన్ రిజర్వ్డ్ సీట్లు పెరిగాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమైన సంగతి తెలిసిందే. కొందరు కోర్టుకు వెళ్లడం వంటి సంఘటనల కారణంగా చివరకు పాత పద్దతిలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
2018 పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్ల కేటాయింపులు జరిగాయి. 2011 జనాభా ప్రాతిపదికతో పాటు గతేడాదిలో నిర్వహించిన సర్వే ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రిజర్వేషన్లను ఆఫీసర్లు ఖరారు చేశారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో కల్పించిన రిజర్వేషన్ల కంటే ఈసారి బీసీలకు సీట్లు తగ్గిపోయాయి.
యాదాద్రిలో బీసీలకు తగ్గి.. ఎస్సీ,ఎస్టీలకు పెరిగినయ్
2019 పంచాయతీ ఎన్నికల్లో యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో 421 పంచాయతీలు ఉన్నాయి. అప్పట్లో జిల్లాఫీసర్లు రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టారు. ఆ ఎన్నికల్లో బీసీలకు 115 సర్పంచ్ స్థానాలు, ఎస్సీలకు 66, ఎస్టీలకు 47, అన్ రిజర్వ్డ్ 193 స్థానాలున్నాయి. మొత్తంగా మహిళలకు 209, జనరల్‌కు 212 సీట్లను కేటాయించారు. కాగా జిల్లాలో ఈసారి ఒకటి తగ్గి ఏడు పంచాయతీలు పెరగడంతో 427కు చేరింది. అయితే ఈసారి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించారు. బీసీలకు 105 రిజర్వ్ చేయడంతో గతం కంటే పది సీట్లు తగ్గిపోయాయి.
గతంలో కంటే ఎస్సీలకు 8 పెంచి 74, ఎస్టీలకు రెండు పెంచి 49 రిజర్వ్ చేశారు. అన్ రిజర్వ్డ్ కేటగిరిలో ఆరు పెంచి 199 కేటాయించారు. మొత్తంగా మహిళలకు మాత్రం 14 స్థానాలు తగ్గించి 195, అన్ రిజర్వ్డ్ స్థానాలను 20 పెంచి 232 కేటాయించారు. వార్డుల్లోనూ బీసీలకు ఆరు తగ్గిపోయాయి.
నల్గొండలో 24 తగ్గినయ్
నల్గొండ జిల్లాలో 869 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో 384 ఆన్ రిజర్వ్డ్ గా ఉంచగా మహిళలకు 186, జనరల్ కు 198 స్థానాలను కేటాయించారు. బీసీలకు 140 స్థానాలకు రిజర్వ్ కాగా అందులో మహిళలకు 62, జనరల్‌కు 78 స్థానాలకు కేటాయించారు. ఎస్సీ కేటగిరీకి 153 స్థానాలకు రిజర్వ్ చేయగా అందులో మహిళలకు 69, జనరల్ కు 84 స్థానాలు కేటాయించారు. ఎస్టీ కేటగిరీలో 192 స్థానాలు రిజర్వ్ కాగా అందులో మహిళలకు 88, జనరల్ కు 104 స్థానాలను కేటాయించారు.
2019లో 164 స్థానాలను బీసీలకు కేటాయించగా ఈ సారి మాత్రం 24 స్థానాలు తగ్గి 140 స్థానాలను కేటాయించారు. సెప్టెంబర్ నెలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం జిల్లాలో 310 స్థానాలకు కేటాయిస్తే ఇప్పుడు కేవలం 140 స్థానాలు మాత్రమే దక్కాయి. తాజాగా ప్రకటించిన జాబితాలో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో పెద్దగా మార్పు లేదు. కాగా సూర్యాపేట జిల్లాలో గతంలో మాదిరిగానే రిజర్వేషన్ల కేటాయింపు జరిగింది.
కొత్త పంచాయతీల్లో..
యాదాద్రి జిల్లాలోని ఏడు కొత్త పంచాయతీల్లోనూ బీసీలకే ఎక్కువగా రిజర్వ్ అయ్యాయి. ఆలేరు మండలంలో కొత్తగా ఏర్పడిన బైరామ్ నగర్ బీసీ(జనరల్),సాయిగూడెం ఎస్సీ(మహిళ), బొమ్మల రామారంలోని కాజీపేట బీసీ(మహిళ) మోటకొండూరులోని ఆబిద్నగర్ అన్ రిజర్వ్డ్, పెద్దబావి బీసీ(మహిళ), తుర్కపల్లిలోని గుజ్జవాని కుంట అన్రిజర్వ్డ్, ఇందిరా నగర్ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. కాగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సొంత గ్రామమైన సైదాపురం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి సొంత గ్రామమైన వలిగొండ అన్ రిజర్వ్ అయింది.
ఆశావహుల ఆశలు..
పంచాయతీల పదవీకాలం ముగిసిన రెండేండ్లు కావస్తున్న సందర్భంలో ఎన్నికలు రావడంతో ఆశావహులు ఆశల్లో మునిగిపోయారు. అయితే రిజర్వేషన్లలో రొటేషన్ పద్దతి అమలు చేయడంతో అనుకున్నట్టుగా రాలేదు. కొన్ని చోట్ల మహిళలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో చాలా మంది నిరాశకు లోనయ్యారు.
జిల్లాల్లో రిజర్వేషన్లు ఇలా..
జిల్లా సర్పంచులు ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్
యాదాద్రి 427 74 49 105 199
సూర్యాపేట 486 111 91 68 216
నల్గొండ 869 192 153 140 384
