బీఆర్ఎస్ హయాంలో చాకలి ఐలమ్మకు గౌరవం దక్కలే : మంత్రి  పొన్నం

బీఆర్ఎస్ హయాంలో చాకలి ఐలమ్మకు గౌరవం దక్కలే : మంత్రి  పొన్నం
  • మహిళా వర్సిటీకు ఆమె పేరు పెడితే జీర్ణించుకోలేక పోతున్నరు: మంత్రి  పొన్నం
  • ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం: మంత్రి జూపల్లి కృష్ణారావు

బషీర్ బాగ్/ హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీరనారి చాకలి ఐలమ్మకు గౌరవం దక్కలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెట్టే ధైర్యం చేయలేదన్నారు. తమ ప్రభుత్వం ఆ వర్సిటీకి ఆమె పేరు పెట్టి జీవో విడుదల చేస్తే.. కొంతమంది జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్ రవీంద్ర భారతిలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధ్యక్షతన చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిని చేసి.. ఆమె కుటుంబాన్ని గుర్తించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అధికారంలో ఉన్న పదేండ్లు ఏనాడూ బీసీలను పట్టించుకోని నాయకులు.. నేడు బీసీల మీటింగ్ కోసం చెన్నైకి వెళ్లారని విమర్శించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో రాష్ట్రంతో పాటు పార్లమెంట్ లో కులగణన తీర్మానం ప్రవేశపెడుతామన్నారు. రాష్ట్రంలో కులగణన కోసం తీర్మానం చేసి నిధులు కూడా మంజూరు చేశామని.. త్వరలోనే ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.

నిజాం నిరంకుశానికి, రజాకార్లకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భూమి కోసం,  భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి.. తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటిన నిప్పు కణిక మన తెలంగాణ వీర వనిత ఐలమ్మ అని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. 

గురుకులాల్లో గేమ్స్ పై ఫోకస్

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో  బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని గురుకుల అధికారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో పలు కంపెనీలు సీఎస్ఆర్ ఫండ్స్ కింద ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చాయని మంత్రి గుర్తు చేశారు. గురుకులాల్లో కూడా వారి సహకారం తీసుకోవాలని  సూచించారు. గురువారం సెక్రటేరియెట్​లో బీసీ గురుకుల అధికారులతో మంత్రి పొన్నం రివ్యూ నిర్వహించారు.

గురుకులాలు, బీసీ హాస్టల్స్​ను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. హాస్టల్స్​లో నాణ్యమైన ఆహారం అందించాలని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని మంత్రి సూచించారు. గురుకులాల్లో విద్యార్థుల స్టడీ అవర్స్, బ్రేక్ ఫాస్ట్, లంచ్ టైమింగ్స్  విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. విద్యార్థుల సిలబస్, ప్రాక్టికల్స్, గేమ్స్ తదితర అంశాలపై 15 రోజులకోసారి రివ్యూ చేసి నివేదిక పంపాలని మంత్రి ఆదేశించారు.

వచ్చే నెల 1న జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు, అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారులు, ఆర్సీవోలు, డీసీవోలు, హాస్టల్ వార్డెన్లు, స్కూల్ ప్రిన్సిపల్స్ తోపాటు అన్ని కార్పొరేషన్ల ఎండీలు, ఉన్నతాధికారులతో మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని గురుకుల స్కూళ్లలో రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించాలని సూచించారు.

గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కమిషనర్ బాల మాయాదేవి, గురుకులాల సెక్రటరీ సైదులు, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు పాల్గొన్నారు.