జనగణనలోనే బీసీల లెక్కలు నమోదు చేయాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

జనగణనలోనే బీసీల లెక్కలు నమోదు చేయాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్
  • ఢిల్లీ జంతర్ మంతర్  వద్ద మహా ధర్నా
  •     ఓబీసీ కులగణనపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ పెట్టాలి: జాజుల
  •     హాజరైన ఎంపీలు, బీసీ సంఘాల నేతలు

న్యూఢిల్లీ, వెలుగు: దేశ వ్యాప్త జనగణనలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీల కుటుంబ లెక్కలు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. జాతి జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించి, కులగణన ప్రారంభించాలనే డిమాండ్ తో సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్రీయ ఓబీసీ మహా సంఘ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

దేశ వ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన 16 మంది పార్లమెంట్ సభ్యులు, ఎనిమిది రాజకీయ పార్టీలు, 15 రాష్ట్రాల నుంచి ఓబీసీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో బీసీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. బీసీల సుదీర్ఘ పోరాట ఫలితంగా దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం జనగణనలో సమగ్ర కులగణన చేపడతామని గతేడాది ఏప్రిల్ 30న నిర్ణయం తీసుకుందన్నారు.

అయితే ఈ ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన చేపడుతూ బీసీ కుటుంబాలను మాత్రం లెక్కించకపోవడం అన్యాయమన్నారు. జనగణనకు 33 ప్రశ్నలతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం.. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలను లెక్కించాలని పేర్కొని బీసీల గురించి ప్రస్తావించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ కుల కుటుంబ లెక్కలపై ప్రత్యేకంగా చర్చించి స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

లేకపోతే జాతీయస్థాయిలో జేఏసీని ఏర్పాటు చేసి, లక్షలాది మందితో ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేస్తామని నిర్ణయించిన కేంద్రం మాట తప్పిందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విమర్శించారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పార్లమెంట్ వేదికగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలో బీసీ ప్రధాని మోడీ ఉన్నప్పటికీ బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.