IND vs NZ: ఎవ్వరూ ఊహించని క్రికెటర్.. సుందర్‌కు రీప్లేస్ మెంట్ ప్రకటించిన బీసీసీఐ

IND vs NZ: ఎవ్వరూ ఊహించని క్రికెటర్.. సుందర్‌కు రీప్లేస్ మెంట్ ప్రకటించిన బీసీసీఐ

న్యూజిలాండ్ జరగబోయే చివరి రెండు వన్డేలకు స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో దూరమయ్యాడు. తొలి వన్డేలో గాయపడిన సుందర్ మిగిలిన రెండు వన్డేలకు అందుబాటులో ఉండడం లేదు. సుందర్ కు రీప్లేక్ మెంట్ గా బీసీసీఐ సోమవారం (జనవరి 12) ఆయుష్ బదోనిని ప్రకటించింది. ఢిల్లీకి చెందిన బదోనీ రీప్లేస్ మెంట్ ఊహించనిది. తొలిసారి భారత జట్టులో స్థానం దక్కించుకున్న ఈ లక్నో సూపర్ జయింట్స్ క్రికెటర్ త్వరలోనే భారత వన్డే జట్టులో చేరతాడు. సుందర్ లాగే బ్యాటింగ్ చేయడంతో పాటు స్పిన్ వేయడంతో బదోనీకి సెలక్టర్లు అవకాశమిచ్చారు.

"ఆదివారం వడోదర వేదికగా బిసిఎ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్నప్పుడు వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. ఎడమ వైపు దిగువ పక్కటెముక ప్రాంతంలో గాయం కావడంతో అసౌకర్యం ఉన్నట్లు తేలింది. సుందర్ కు మరిన్ని స్కాన్ లు జరుగుతాయి. ఆ తర్వాత బీసీసీఐ వైద్య బృందం నిపుణుల అభిప్రాయం తీసుకుంటుంది. మెన్స్ సెలక్షన్ కమిటీ అతని స్థానంలో ఆయుష్ బదోనీని ఎంపిక చేసింది. బదోనీ రెండో వన్డే జరిగే రాజ్‌కోట్‌లో భారత జట్టులో చేరతాడు". అని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది.

తొలి వన్డే ఆడుతూ సుందర్ కు గాయం:
  
ఆదివారం (జనవరి 11) వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో సుందర్ బౌలింగ్ చేస్తూ అసౌకర్యానికి గురయ్యాడు. 5 ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు ఇచ్చి మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 8వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. మ్యాచ్ తర్వాత సుందర్ కు ఎడమ పక్కటెముకలు గాయం అయినట్టు తేలింది. సుందర్ దూరం కావడంతో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ 11లో చోటు దక్కడం ఖాయంగా మారింది. స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఉన్నప్పటికీ వచ్చే నెలలో టీ20 వరల్డ్ కప్ ఉండడంతో పని భారం కారణంగా వన్డేలకు ఎంపిక చేసే అవకాశాలు కనిపించడం లేదు. 
 
న్యూజిలాండ్ తో రెండు, మూడు వన్డేలకు భారత జట్టు:  
 
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ , విరాట్ కోహ్లి , కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా , మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌ , నితీష్‌ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ఆయుష్ బడోని, ప్రసిద్ కృష్ణ, అర్షదీప్ సింగ్