భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ డ్రీమ్11కు బీసీసీఐ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. జులై 2023 నుంచి టీమిండియా లీడ్ స్పాన్సర్గా డ్రీమ్11 తో బీసీసీఐ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయాయని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధృవీకరించారు. డ్రీమ్ 11 నుంచి విడిపోవడంతో ఆసియా కప్ ముందు భారత క్రికెట్ జట్టు కొత్త స్పాన్సర్ షిప్ ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియన్ క్రికెట్ టీమ్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం బీసీసీఐ మంగళవారం బిడ్స్‌ను ఆహ్వానించింది.
కొత్త స్పాన్సర్ వేటలో ఉన్న బీసీసీఐ బిడ్స్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. బిడ్స్‌ను దాఖలు చేసేందుకు ఈ నెల 16 చివరి తేదీగా పేర్కొంది. దీంతో సెప్టెంబర్ 9న యుఎఇలో ఆసియా కప్ ప్రారంభం కానుండటంతో టీమిండియా తమ జెర్సీలపై స్పాన్సర్ లేకుండా ఈ టోర్నమెంట్ ఆడనుంది. కొత్త స్పాన్సర్ ను వెతికే పనిలో బీసీసీఐ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా బెట్టింగ్, జూదం లేదా ఆన్‌లైన్ మనీ గేమింగ్‌తో లింక్ ఉన్న ఉన్న బ్రాండ్‌లను బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి బీసీసీఐ అనుమతించదని టెండర్ పత్రం జారీ చేసింది.
అథ్లెటిజర్, స్పోర్ట్స్ వేర్ తయారీదారులు దరఖాస్తు చేసుకోకూడదు. ఇప్పటికే స్పాన్సర్లుగా ఉన్న బ్యాంకులు, ఆర్థిక సేవలను అందించే సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలు, కూల్ డ్రింక్స్ తయారు చేసే కంపెనీలకు చాన్స్ లేదు. దరఖాస్తు చేయాలనుకునే కంపెనీలు ‘ఇన్విటేషన్ ఫర్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఐఈఓఎల్)ను రూ. 5 లక్షలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బిడ్డింగ్ చేసే కంపెనీల వార్షిక టర్నోవర్ రూ. 300 కోట్లకు పైగా ఉండాలి. 2023 నుంచి 2026 వరకు రూ. 358 కోట్లకు టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను దక్కించుకున్న డ్రీమ్ ఎలెవన్.. ఏడాది కాలం మిగిలి ఉండగానే తప్పుకుంది. అయితే దీనికి ఎలాంటి జరిమానా విధించే చాన్స్ లేదు.
బిడ్డింగ్ నుండి నిషేధించబడిన వర్గాలు:
ఆల్కహాల్ ఉత్పత్తులు
బెట్టింగ్ లేదా జూదం సేవలు
క్రిప్టోకరెన్సీ, సంబంధిత వ్యాపారాలు
ఆన్‌లైన్ గేమింగ్ చట్టం, 2025 ప్రకారం నిషేధించబడిన ఆన్‌లైన్ మనీ గేమింగ్ లేదా ఏదైనా కార్యాచరణ
పొగాకు ఉత్పత్తులు
ప్రజా నైతికతను దెబ్బతీసే ఏదైనా బ్రాండ్ (అశ్లీలత వంటివి)
