
- టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం బిడ్స్ ఆహ్వానించిన బీసీసీఐ
- రియల్ మనీ గేమింగ్, క్రిప్టో కరెన్సీ సంస్థలకు నో చాన్స్
న్యూఢిల్లీ: ఇండియన్ క్రికెట్ టీమ్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం బీసీసీఐ మంగళవారం బిడ్స్‌ను ఆహ్వానించింది. గేమింగ్ బిల్లు–2025 పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో ఇప్పటి వరకు ఉన్న డ్రీమ్ ఎలెవన్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంది. ఫలితంగా కొత్త స్పాన్సర్ వేటలో ఉన్న బీసీసీఐ బిడ్స్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. బిడ్స్‌ను దాఖలు చేసేందుకు ఈ నెల 16 చివరి తేదీగా పేర్కొంది. ఫలితంగా 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో స్పాన్సర్ లేకుండా టీమిండియా బరిలోకి దిగనుంది.
ఆన్‌లైన్ గేమింగ్, రియల్ మనీ గేమింగ్, క్రిప్టో కరెన్సీ (ట్రేడింగ్, ఎక్ఛెంజ్, టోకెన్స్), బెట్టింగ్, గాంబ్లింగ్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గానీ సంబంధం ఉండకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది. అథ్లెటిజర్, స్పోర్ట్స్ వేర్ తయారీదారులు దరఖాస్తు చేసుకోకూడదు. ఇప్పటికే స్పాన్సర్లుగా ఉన్న బ్యాంకులు, ఆర్థిక సేవలను అందించే సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలు, కూల్ డ్రింక్స్ తయారు చేసే కంపెనీలకు చాన్స్ లేదు. దరఖాస్తు చేయాలనుకునే కంపెనీలు ‘ఇన్విటేషన్ ఫర్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఐఈఓఎల్)ను రూ. 5 లక్షలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బిడ్డింగ్ చేసే కంపెనీల వార్షిక టర్నోవర్ రూ. 300 కోట్లకు పైగా ఉండాలి. 2023 నుంచి 2026 వరకు రూ. 358 కోట్లకు టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను దక్కించుకున్న డ్రీమ్ ఎలెవన్.. ఏడాది కాలం మిగిలి ఉండగానే తప్పుకుంది. అయితే దీనికి ఎలాంటి జరిమానా విధించే చాన్స్ లేదు.