కోహ్లీ త్వరలో ఫాంలోకి వస్తాడు

కోహ్లీ త్వరలో ఫాంలోకి వస్తాడు

ఫాంలేమితో తంటాలు పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అండగా నిలిచాడు. ఆటగాళ్ల కెరియర్లో ఇవన్నీ సర్వసాధారణం అని చెప్పారు. ప్రతీ ప్లేయర్ ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిందేనని చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు తనతో పాటు  సచిన్, ద్రవిడ్లకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని గంగూలీ చెప్పాడు. 

త్వరలో ఫాంలోకి వస్తాడు..
విరాట్ కోహ్లీ ఫాంపై ఆందోళన అవసరం లేదని గంగూలీ అన్నాడు. అతను త్వరలోనే ఫాంలోకి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. అతని అంతర్జాతీయ కెరియర్లో సాధించిన రికార్డులు చూడాలని..అతనికి నైపుణ్యం, సామర్థ్యం ఉన్నాయన్నాడు. ప్రస్తుతం కోహ్లీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడని..అది అతనికి కూడా తెలుసని చెప్పాడు. గత 12, 13 ఏళ్లుగా కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడని వెల్లడించాడు. కోహ్లీకే కాదు  భవిష్యత్తులో వచ్చే ఆటగాళ్లకు కూడా జరుగుతుందన్నాడు.  ఇదంతా క్రీడల్లో భాగమన్న గంగూలీ...కోహ్లీ మునుపటి ఫాంలోకి వస్తాడని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

 

కోహ్లీపై విమర్శలు
ఫాంలేమితో జట్టుకు భారంగా మారిన కోహ్లీపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తీవ్ర విమర్శలు చేశాడు. అతన్ని టీ20ల నుంచి తప్పించాలన్నాడు. సరిగా ఆడని ఆటగాళ్లను పక్కన పెట్టేయాలని మాజీ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా కోహ్లీ ఫాంలోపై వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ రాణించకుంటే టీ20 వరల్డ్ కప్లో ఆడటం కష్టమే అన్నాడు. 

గంగూలీకి  బ్రిటన్ పార్లమెంట్ సన్మానం
మరోవైపు  బీసీసీఐ అధ్యక్షుడు  సౌరభ్ గంగూలీని బ్రిటన్ పార్లమెంట్ ఘనంగా సత్కరించింది.  ఈ సందర్భంగా గంగూలీ సంతోషం వ్యక్తం చేశాడు.  తనను  బ్రిటన్​ పార్లమెంట్​సత్కరించడం ఆనందంగా ఉందని గంగూలీ తెలిపాడు. 2002లో నాట్​వెస్ట్ సిరీస్ గెలిచిన అనంతరం గంగూలీని బ్రిటన్ సన్మానించింది. తిరిగి 20 ఏళ్ల తర్వాత అదే రోజు గంగూలీ  ఈ గౌరవాన్ని స్వీకరించడం విశేషం.