Asia Cup 2025 Final: ఇంతకు దిగజారుతారా.. ట్రోఫీని వెనక్కి పంపండి: పీసీబీ చైర్మన్‌కు బీసీసీఐ సెక్రటరీ స్ట్రాంగ్ వార్నింగ్

Asia Cup 2025 Final: ఇంతకు దిగజారుతారా.. ట్రోఫీని వెనక్కి పంపండి: పీసీబీ చైర్మన్‌కు బీసీసీఐ సెక్రటరీ స్ట్రాంగ్ వార్నింగ్

ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఆసియా కప్ 2025 ఫైనల్ హై డ్రామాతో ముగిసింది. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ లో చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా విజయాన్ని అందుకుని ఆసియా కప్ సొంతం చేసుకుంది. 5 వికెట్ల తేడాతో చిరాకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఓడించిన ఇండియా సగర్వంగా టైటిల్ అందుకోలేకపోయింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ పాకిస్థాన్ క్రికెట్ చైర్మన్ కూడా కావడంతో అతని నుంచి ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా నిరాకరించింది. 

భారత జట్టు ఆసియా కప్ ట్రోఫీ లేకుండానే మ్యాచ్ తర్వాత వేడుకలు నిర్వహించాల్సి వచ్చింది. నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా   ట్రోఫీ తీసుకోవడానికి అంగీకరించపోయినప్పటికీ.. విజేత జట్టుకు ట్రోఫీని ఇవ్వకూడదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. నఖ్వీ ట్రోఫీని తనతో పాటు తీసుకెళ్లడం తీవ్ర విమర్శలకు గురి చేస్తోంది. ఒక పెద్ద హోదాలో ఉండి చిన్నపిల్లాడిలా ప్రవర్తించడం ఎవరికీ నచ్చడం లేదు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా మొహ్సిన్ నఖ్వీ చేసిన పనికి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఈ పాక్ చైర్మన్ పై విమర్శల వర్షం కురిపించాడు. 

నఖ్వీ ప్రవర్తించిన తీరుపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ ఇలా అన్నాడు. " ఇండియా ఒక దేశంతో యుద్ధం చేస్తోంది, ఆ దేశానికి చెందిన నాయకుడు మనకు ట్రోఫీని అందజేయాల్సి ఉంది. మన దేశంపై యుద్ధం చేస్తున్న దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి నుండి మేము ట్రోఫీని అంగీకరించలేము. కాబట్టి మేము ఆ ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించాము. కానీ ఆ పెద్దమనిషి మన దేశానికి ఇవ్వాల్సిన ట్రోఫీని, పతకాలను తన సొంత హోటల్ గదికి తీసుకెళ్తాడని దీని అర్థం కాదు. ఇది పూర్తిగా ఊహించనిది. అతను వీలైనంత త్వరగా ట్రోఫీని భారతదేశానికి తిరిగి పంపుతాడని ఆశిస్తున్నాం". అని సైకియా  ఫైనల్ ముగిసిన తర్వాత పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ పై విమర్శలు కురిపించాడు. 

"ఇండియా విజయంపై బీసీసీఐ చాలా సంతోషంగా ఉంది. గ్రూప్ దశలో, సూపర్ ఫోర్‌లో, ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించినందుకు భారత క్రికెట్ జట్టును మేము అభినందిస్తున్నాము. మూడు మ్యాచ్‌లు ఏకపక్షంగా జరిగాయి. మన దేశానికి చాలా కీర్తిని తెచ్చినందుకు మా ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని మేము అభినందిస్తున్నాము. మా జట్టు గురించి మేము చాలా గర్వపడుతున్నాము. వారు క్రికెట్ పిచ్‌పై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. భారత క్రికెట్‌కు ఇది ఒక చిరస్మరణీయ సందర్భం. టీమిండియాకు రూ.21 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ ప్రైజ్ మనీని ఆటగాళ్లకు సహాయక సిబ్బందికి పంపిణీ చేస్తాము". అని సైకియా తెలిపారు. 

ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ లో జరిగిన ఈ తుది సమరంలో పాకిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో గెలిచి రికార్డ్ స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కప్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో ఇండియా 19.4 ఓవర్లలలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్ వర్మకు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అభిషేక్ శర్మకు లభించింది.