బీజేపీతోనే బీసీలు, దళితులకు సముచిత స్థానం : సామ రంగారెడ్డి

బీజేపీతోనే  బీసీలు, దళితులకు సముచిత స్థానం : సామ రంగారెడ్డి

ఎల్బీనగర్, వెలుగు:  భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతి అని ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి అన్నారు. ఎల్‌బీనగర్‌  బీసీ కులాల సమన్వయ వేదిక  బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.  తెలంగాణ బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షులు బొమ్మ రఘురాం నేత ఆధ్వర్యంలో ఆదివారం సామ రంగారెడ్డికి మద్దతు ప్రకటిస్తూ ఎల్‌బీనగర్‌‌లో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సామ రంగారెడ్డి మాట్లాడుతూ..  బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చినా పార్టీ బీజేపీ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 

బడుగు బలహీన వర్గాల సామాజిక స్పృహ కలిగిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణ మాదిగ, బీసీ నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్‌  లాంటి వారు బీజేపీకి మద్దతు ప్రకటించడాన్ని బట్టి చూస్తే,  బీజేపీకి బడుగు బలహీన వర్గాల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.  అందరికీ అందుబాటులో ఉండే రంగారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని బీసీ నేతలు అన్నారు.  ఆదివారం నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో సామ రంగారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. బీఆర్‌ఎస్‌ బీసీ యూత్‌ వింగ్‌ నేతలు  క్రాంతి యాదవ్‌, బీఆర్‌ఎస్‌ మాజీ వార్డు సభ్యుడు అమర్‌జీ, మల్లేష్‌, నరేష్‌, యశ్వంత్‌, నాగరాజుల బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీలో చేరారు.