కులగణనలో బీసీలు 5.5% పెరిగారు.. ఓసీలు 6% తగ్గారు..

కులగణనలో బీసీలు 5.5% పెరిగారు.. ఓసీలు 6% తగ్గారు..
  • మీడియాతో చిట్​చాట్​లో సీఎం రేవంత్​ వెల్లడి
  • ప్రజల్ని బీఆర్​ఎస్​ తప్పుదోవ పట్టిస్తున్నదని ఫైర్​
  • సైంటిఫిక్​ మెథడ్​లో కులగణన సర్వే చేపట్టినం
  • ముస్లింల రిజర్వేషన్ల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం
  • ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులు ఉండవ్​
  • చట్టప్రకారమే చర్యలు.. కర్మ ఎవర్నీ వదలదు
  • మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్​
  • పార్టీ ఇచ్చిన పని పూర్తిచేయడమే నా బాధ్యత..వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు
  • తన ఫోకస్​ అంతా రాష్ట్రాభివృద్ధిపైనేనని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో ఐదున్నర శాతం బీసీ పర్సంటేజ్ పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఓసీలు 6 శాతం తగ్గారని తెలిపారు. దశాబ్దాల సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తున్నదని.. ఇందులో కులగణన, ఎస్సీ వర్గీకరణ, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల వంటి అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. శుక్రవారం పార్లమెంట్ ఓల్డ్ బిల్డింగ్ (సంవిధాన్ సదన్) లో మీడియాతో సీఎం రేవంత్ చిట్​చాట్ చేశారు. కులగణనపై తాము సైంటిఫిక్ మెథడ్​లో సర్వే చేయించామని, ఆషామాషీగా చేసింది కాదన్నారు. ‘‘ఎంతో జాగ్రత్తగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కులగణన చేపట్టాం. ఇదేమీ నేను రాసుకొచ్చిన కులగణన లెక్కలు కావు. ఎవర్నో ఆకట్టుకునేందుకు చేయలే” అని స్పష్టం చేశారు. 

ఇన్నాళ్లూ బీసీ–ఈ లెక్కలు లేక సమస్య

కేసీఆర్  హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూస్తే 51 శాతం బీసీలు, 21 శాతం ఓసీలు, 18 శాతం ఎస్సీలు, 10 ఎస్టీలు ఉన్నారని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. కానీ.. తమ సర్వేలో బీసీ– ఏ,బీ,సీ,డీలో 46.25 శాతం, బీసీ– ఈలో 10.08 శాతం జనాభా ఉన్నట్లు తేలిందని.. ఈ రెండు కలిపితే 56.33 శాతంగా బీసీల లెక్కలు తేలాయన్నారు. బీసీ---–ఈ జనాభా లెక్కలు లేనందునే రిజర్వేషన్ల విషయంలో సమస్యలు వస్తున్నాయని.. అయితే, తమ ప్రభుత్వ సర్వేతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ తప్పుడు లెక్కలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నదని మండిపడ్డారు. తాము కులగణనలో సేకరించిన అన్ని వివరాలకు త్వరలో చట్టరూపం కల్పిస్తామన్నారు. బిల్లు రూపంలో అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధం
చేస్తామని సీఎం ప్రకటించారు. 

గ్రౌండ్స్ లేకుండా అరెస్ట్ చేస్తే ఐదు నిమిషాల్లో బెయిల్

ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్​ అన్నారు. ‘‘ఫార్ములా–ఈ రేస్ విషయంలో గ్రౌండ్స్ లేకుండా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఐదు నిమిషాల్లో కోర్టులు బెయిల్ ఇస్తాయి. ఈ కేసులో లండన్ కు చెందిన ఇటాలియన్ సంస్థకు దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చాయి. ఆ సంస్థ టైం అడిగింది. ఫస్ట్ ఆ సంస్థ స్టేట్​మెంట్ రికార్డు చేయాల్సి ఉంది. బీఆర్ఎస్ సర్కార్ మాదిరిగా అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి అరెస్ట్​ చేయాల్సిన అవసరం మాకు లేదు. చట్టం ప్రకారం ముందుకు వెళ్తాం.  గ్రౌండ్స్ ఉంటే వాళ్లే నెలల తరబడి జైల్లో ఉంటారు” అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్షతో కేసులు పెట్టబోమని, అంతా చట్ట ప్రకారమే జరుగుతుందని చెప్పారు. తాను రాష్ట్ర అభివృద్ధి కోసం, చరిత్రలో నిలిచిపోయేపాలన కోసం దృష్టి సారించాలని అన్నారు. ‘‘కర్మ ఎవర్నీ వదలదు. మనం చేసింది.. మనకు రివర్స్ వస్తుంది. ఇప్పటికే హరీశ్​రావు కోర్టు లకు వెళ్లి అరెస్ట్ చేయకుండా స్టేలు తెచ్చుకుంటున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు.  ప్రజలకు  ఇచ్చిన హామీలను ఒక్కటొకటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, రుణ మాఫీ ఇలా అన్ని నెరవేరుస్తున్నామని తెలిపారు. భవిష్యత్ లో ఎవరైనా రాస్తే.. సీఎంగా రేవంత్ రెడ్డి చేసిన ఎస్సీ వర్గీకరణ, కుల గణన, ఇతర స్కీం గురించి చరిత్రలో నాలుగు లైన్లు రాయక తప్పదని ఆయన అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీం కింద ప్రతి నెల ఆర్టీసీ కార్పొరేషన్ కు రూ. 400 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు.  ఈ లెక్కన ఇప్పటి వరకు రూ. 4,100 కోట్లు చెల్లించామన్నారు. దీంతో ఆర్టీసీ లాభాల బాట పట్టిందని ఆయన 
పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై తొలినాళ్లలో ఆటో, మెట్రోకు నష్టమని బీఆర్ఎస్ పనికి మాలిన ఆరోపణలు చేసిందని, ఆ చెత్త కామెంట్లు ఇప్పుడు డస్ట్ బిన్​లోకి వెళ్లాయని అన్నారు. 

ఢిల్లీ తెలంగాణ భవన్ డిజైన్ ఫైనల్

కులగణన, ఎస్సీ వర్గీకరణతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం చరిత్రలో ఉండి పోతుందని ముఖ్యమంత్రి రేవంత్ ​రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ నిర్మాణ డిజైన్ ఫైనల్ అయిందని చెప్పారు. త్వరలో పనులు ప్రారంభం అవుతాయవెల్లడించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్​నర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో ఈ బిల్డింగ్​ నిర్మాణం ఉంటుందని స్పష్టం చేశారు. పటౌడి హౌస్​లో తెలంగాణ భవన్, హైద రాబాద్ హౌస్​ను ఆనుకొని గవర్నర్, సీఎం, మం త్రుల కాటేజ్ నిర్మించబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్​ పేర్కొన్నారు. 

మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్​

మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో తమ పార్టీ అధిష్ఠానానిదే ఫైనల్​ నిర్ణయమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో తానెవరి పేర్లను, సూచనలను హైకమాండ్ కు ఇవ్వలేదన్నారు. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని.. ఒకటీరెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ తీసుకునే దాదాపు అన్ని కీలక నిర్ణయాలు అధిష్టానం దృష్టిలో ఉంటాయన్నారు. ‘‘పార్టీ పెద్దలకు తెలియకుండా నిర్ణయాలు ఉంటాయని తెలియనివాళ్లు అనుకుంటే చేసేదేమీ లేదు. పార్టీ, పార్టీ నేతల మనోభావాలకు తగ్గట్టుగానే ఉంటాను తప్ప.. వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి, తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి తెలియని వాళ్లు ఎన్ని మాట్లాడుకుంటే తనకేం ఇబ్బంది లేదన్నారు. పని చేసుకుంటూ పోవడమే తనకు తెలుసని.. ప్రతి ఒక్క విమర్శకు తాను స్పందించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.