జూబ్లీహిల్స్ ఫలితం తేల్చేది బీసీలు, ముస్లింలే

జూబ్లీహిల్స్ ఫలితం తేల్చేది బీసీలు, ముస్లింలే
  • సెగ్మెంట్​లో 4 లక్షల మంది ఓటర్లలో 2 లక్షల మంది బీసీలే
  • 96,500 మంది ముస్లింలు.. 30-39 ఏండ్ల మధ్య 25% మంది
  • వీరిని ప్రసన్నం చేసుకునే పనిలో అన్ని పార్టీలు

హైదరాబాద్​సిటీ, వెలుగు:జూబ్లీహిల్స్​ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాన్ని  ఈసారి బీసీలు, ముస్లింలే నిర్ణయించనున్నారు. ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్యలో వీరే అధికంగా ఉండడంతో.. వీరి ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వారే విజేతలుగా నిలువనున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ రెండు వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. 

జూబ్లీహిల్స్‌‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982 కాగా,  ఇందులో దాదాపు 2లక్షల వరకు బీసీ ఓటర్లే ఉన్నారు. రెహమత్​నగర్, బోరబండ, ఎర్రగడ్డ, యూసుఫ్​గూడ, షేక్‌‌పేట డివిజన్లలో అధిక శాతం పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారే ఎక్కువ. ఇందులో అధికశాతం మంది బీసీ ఓటర్లే. ఆ తర్వాత ముస్లిం ఓటర్ల సంఖ్య 96,500 వరకు ఉంది. 

బోరబండ, షేక్‌‌పేట, ఎర్రగడ్డలాంటి ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బీసీల తర్వాత విజేతను నిర్ణయించడంలో వీరి పాత్ర కూడా కీలకమే. దీంతో వీరి ఓట్లపై వివిధ రాజకీయ పార్టీలు కన్నేశాయి.  

వర్గాలవారీగా ఓటర్ల శాతం ఇలా

నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉండగా, ఇందులో పురుష ఓటర్లు 2,07,367 , మహిళా ఓటర్లు 1,91,530 మంది ఉన్నారు. ఇందులో ముస్లిం ఓటర్లు 96,500 (24 శాతం) ఉండగా.. వలస ఓటర్లు 35 వేలు (8.7 శాతం), ఎస్సీలు 26 వేలు (6.5 శాతం), మున్నూరు కాపు ఓటర్లు 21,800 (5.5 శాతం), కమ్మ ఓటర్లు 17 వేలు (4.5 శాతం), యాదవులు 14 వేలు (3.5 శాతం), క్రిస్టియన్లు 10 వేలు (2.5 శాతం) ఉన్నారు. 

నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో ఉన్న మైనారిటీ ఓటర్లు కూడా ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు. నియోజకవర్గంలోని ఆయా డివిజన్ల పరిధిలో పేద, మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలు అధికంగా ఉండే ప్రాంతాలపై ఆయా పార్టీలు ఫోకస్​ పెడుతున్నాయి. ఇందులో ఏ వయస్సు ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందన్నది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

ఇందులో ఈసారి కొత్తగా ఓటు హక్కు పొందిన వారిలో 18 నుంచి 19 ఏండ్ల మధ్య వయసున్న ఓటర్లు 12,380 (3.10%) ఉండగా.. 20 – 29 మధ్య వయసు వారు 17,500 (18.20%)  మంది ఉన్నారు. ఇక 30 – 39 మధ్య వయసున్న ఓటర్లు 96,815 (24.30 శాతం), 40 – 49 మధ్య 87,492 (21.90శాతం), 50 – 59 మధ్య 67,703 (17శాతం), 60 – 69 మధ్య 38 వేలు (9.5 శాతం), 70 – 79  మధ్య వయసు ఉన్న ఓటర్లు 18వేలు (4.5శాతం), 80 ఏండ్లు ఆ పై వయసుగల ఓటర్ల సంఖ్య 6,052 (1.5శాతం) ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 

వీరిలో అత్యధికంగా 30–39, 40–49, 50–59 మధ్య వయస్సున్న ఓటర్లు ఎటు వైపు మొగ్గుతారన్న దానిపై ఆసక్తి నెలకొన్నది.