బీసీ కోటా కోసం అక్టోబర్ 18న రాష్ట్ర బంద్ ..అన్ని పార్టీలు, సంఘాల మద్దతు

బీసీ కోటా కోసం అక్టోబర్ 18న రాష్ట్ర బంద్ ..అన్ని పార్టీలు, సంఘాల మద్దతు
  • శాంతియుతంగా బంద్ నిర్వహిస్తామన్న ఆర్.కృష్ణయ్య
  • ముసారంబాగ్ లో స్టూడెంట్లతో కలిసి పాదయాత్ర 
  • బీసీ బిల్లులు ఆమోదించాలంటూ రాజభవన్ ముందు సీపీఎం నిరసన
  •  బంద్​ను శాంతియుతంగా నిర్వహించాలి.. 
  • హింసాత్మక ఘటనలకు పాల్పడితే చర్యలు: డీజీపీ

స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనే ప్రధాన డిమాండ్​ తో  బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) శనివారం రాష్ట్రవ్యాప్తంగా బంద్​ కు పిలుపునిచ్చింది. 'బంద్ ఫర్ జస్టిస్' పేరుతో నిర్వ హిస్తున్న ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల జేఏసీవిజ్ఞప్తి మేరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సీపీఎం, సీపీఐ లాంటి లెఫ్ట్ పార్టీలు, ప్రజా, స్టూడెంట్ యూనియన్లు మద్దతు ప్రకటించి, స్వయంగా పాల్గొంటున్నాయి. అటు బీసీ సంఘాల జేఏసీ నేతలు బంద్​ కు  సహకరించాలని ప్రజలను, వ్యాపారులను, యజమానులను కోరారు.

దీంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు మూతపడే అవకాశముందని భావిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సైతం నడపొద్దని పిలుపునివ్వడంతో బస్సులు రోడ్డెక్కడం కూడా అనుమానమేనని తెలుస్తున్నది. రాజ్యాంగ సవరణ ద్వారానే 42శాతం బీసీ రిజర్వేష స్లకు చట్టబద్ధత లభిస్తుందని, ఇందుకోసం బీజేపీపై ఒత్తిడి తీసుకువస్తామని, కాంగ్రెస్​పై కూడా పోరాడుతామని జేఏసీ నేతలు స్పష్టంచేశారు.

3 ప్రధాన పార్టీల మద్దతు

బీసీ సంఘాల జేఏఎసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపునకు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మద్దతు ప్రకటించాయి. తాము కామారెడ్డి డిక్లరేషన్​ కు  కట్టుబడి ఉన్నామని, బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన సర్వే నిర్వహించామని తెలిపారు. 

బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బీసీ బంద్ లో పాల్గొనా లని కేడర్ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం పిలుపునిచ్చారు. ప్రభుత్వం న్యాయనిపుణు లతో చర్చించి.. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. ఇక బీఆ ర్ఎస్ కూడా బంద్ కు  మద్దతు ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీలోని బీసీ లీడర్లు డిమాండ్ చేశారు. 

బీజేపీకూడా బంద్​ కు  మద్దతు ప్రకటించగా, ఆ పార్టీ నేత బీజేపీ రాజ్యసభసభ్యుడు, జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య స్వయంగా ఈ బంద్​ కు  నేతృత్వం వహిస్తుండడం గమనార్హం.కాగా, తెలంగాణ జాగృతి కూడా బంద్​ కు  సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నకవిత.. జాగృతికేడర్ స్వయంగా బంద్​ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు

ఏకతాటిపైకి బీసీ సంఘాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం జీవో అమలుపై స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా.. హైకోర్టులోనే తేల్చుకోవాలని తేల్చి చెప్పింది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితితో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. 

ఈ పరిణామాలతో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మరింత పీటముడి బిగుసుకున్నది. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానాల తీర్పుల పట్ల బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తిని, ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. జీవో 9పై హైకోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ పిటిషన్ ను పక్కన పెట్టడంతో.. బీసీ సంఘాలు తమ పోరాటాన్ని ఉదృతం చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఏకతాటిపైకి వచ్చిన బీసీ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి రాష్ట్ర బంద్​ కు  పిలుపునిచ్చాయి.