కరోనాపై అలర్ట్ గా ఉండాలె : దామోదర రాజనర్సింహ

కరోనాపై అలర్ట్ గా ఉండాలె : దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, వెలుగు: కరోనాపై అలర్ట్ గా ఉండాలని, వివిధ ఆస్పత్రిల్లోని కరోనా వార్డులకు అవసరమైన మెషీన్లు, మందులు, ఎక్విప్ మెంట్లు సమకూర్చుకోవాలని హెల్త్​ మినిస్టర్ దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడిపై మంత్రి మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో 34, 84 చొప్పున ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ అందుబాటులో ఉంచామని మంత్రికి అధికారులు తెలిపారు. రోజూ 16,500 మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే కెపాసిటీ ఉన్నట్లు వివరించారు. 

మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీపీసీఆర్ కిట్స్ మరిన్ని కొనుగోలు చేయాలని, కరోనా వార్డులలో సౌలతులు పెంచాలన్నారు. రోజూ సాయంత్రం 4 గంటలకు కరోనా బులెటిన్ ఇవ్వాలని ఆదేశించారు.  ప్రైమరీ హెల్త్ సెంటర్లను మరింత బలోపేతం చేయాలని ఆఫీసర్లను హెల్త్ మినిస్టర్ ఆదేశించారు. సర్కార్ దవాఖాన్లలో ప్రసవాల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని చెప్పారు. గర్భిణులకు పోషకాహారంపై అవగాహన కల్పించి, సరైన మందులు అందిస్తూ బాలింత, శిశు మరణాలను తగ్గించాలన్నారు. కాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 8 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్​ కేసుల సంఖ్య 59కి చేరినట్లు అధికారులు తెలిపారు.