- ఎలక్షన్స్ వస్తున్నయ్.. అలర్ట్‌గా ఉండండి
- లా అండ్ ఆర్డర్‌పై సీపీలు, ఎస్పీలతో డీజీపీ సమీక్ష
- పోలీస్ స్టేషన్‌కు వచ్చే వాళ్లతో మర్యాదగా మాట్లాడాలి
- గ్రామీణ ప్రజలకు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించాలి: అంజనీకుమార్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎలక్షన్స్ దగ్గరపడుతున్నందున అలర్ట్‌గా ఉండాలని సీపీలు, ఎస్పీలకు డీజీపీ అంజనీకుమార్ సూచించారు. శుక్రవారం డీజీపీ ఆఫీసులో డా.బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సీపీలు, ఎస్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఎలక్షన్స్ ఇయర్ కావడంతో రాజకీయ పార్టీల బహిరంగ సభలు, ముఖ్యనాయకుల పాదయాత్రలు, ర్యాలీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు.
సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్లాలి
లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాల పనితీరు అత్యంత కీలకమని డీజీపీ అన్నారు. విధి నిర్వహణలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహాలతో పనిచేయాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. తీవ్రవాద పార్టీల సానుభూతిపరులు, మాజీలు, మిలిటెంట్లపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే వాళ్లతో సిబ్బంది, అధికారులు మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. పోలీస్ అధికారుల గ్రామాల సందర్శన కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోందని, దాన్ని కొనసాగించాలన్నారు.
సైబర్ క్రైమ్ గ్రామాలకూ పాకింది
రాష్ట్రంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీజీపీ సూచించారు. సైబర్ క్రైమ్ అనేది కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితం కాలేదని, గ్రామాలకూ వ్యాపించిందన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో కనీసం పది మంది పోలీసులకు సైబర్ క్రైమ్ నివారణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి డ్రైవర్లకు అవగాహన కల్పించాలన్నారు. గోవుల అక్రమ రవాణ జరుగకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.
