
కడుపులో సమస్యా? కలబంద జ్యూస్ తాగండి!
ఏవైనా చర్మ సమస్యలా? కలబంద గుజ్జు వాడండి!
షుగర్ ఉందా? రోజు కలబంద స్లైస్‌ను నోట్లో వేసుకోండి!
అందం పెంచుకోవాలా? ఉందిగా కలబందా!
ఆరోగ్యంగా ఉండాలా? కలబంద దివ్యౌషధం!
ఒక్కమాటలో చెప్పాలంటే.. సర్వవ్యాధి నివారిణి కలబంద!
ఇట్ల… అడక్కుండానే ఉచితంగా సలహాలిచ్చేవారు ఎందరో!!
దేవుడిచ్చిన వరం ఈ కలబంద .. అని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు!!
అయితే ఈ మాటలు చెప్పేవాళ్లందరికీ
కలబంద గురించి తెలిసింది సగమే అని చెప్పాలి.
ఎందుకంటే.. కలబంద వల్ల ఎన్ని లాభాలున్నాయో..
అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి.
వాడకపోతే లాభం కలగదేమో.. కానీ
పద్ధతిగా వాడకపోతే నష్టం మాత్రం తప్పదు.
అలోవెరాగా పిలిచే కలబంద గురించి టీవీల్లో చూసి, పేపర్లలో చదివి, యూట్యూబ్‌లో సెర్చ్ చేసి.. ఎలాపడితే అలా వాడేవారు ఈ మధ్య పెరుగుతున్నారు. ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు కలబంద వాడుతున్నారంటే ఫర్వాలేదు.. కానీ రాబోయే రోజుల్లో ఏ వ్యాధి రాకుండా కూడా అవసరానికి మించి కలబంద వాడుతున్నవారు ఉన్నారు. నిజానికి వారికి కలబందకు ఒకవైపు గురించి మాత్రమే తెలుసు. కలబందకు ఇంకోవైపు గురించి తెలియదు. అది కలిగించే సైడ్ఎఫెక్ట్స్ గురించి అస్సలు తెలియదు.
ఊరికి ఉపకారే కాదు..
మనదేశంలో కలబందను ఆయుర్వేద వైద్యంలో, బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. క్రీములు, లోషన్లు, జ్యూస్‌లు, హెయిర్ ఆయిల్స్ వంటివి తయారుచేస్తున్నారు. అయితే కలబంద అందరూ చెప్పుకునేంతగా ఊరికి ఉపకారే కాదు.. అడ్డదిడ్డంగా వాడితే అపకారిగా కూడా మారుతుంది. ఇష్టమొచ్చినట్లుగా వాడితే ఇరుకున పడడం మాత్రం ఖాయమంటున్నారు డాక్టర్లు. ఇది ఎవరైనా చెబితే… ‘వాళ్ల బొంద, కలబందనే విమర్శిస్తారా’? అని అనుకోకుండా ఓసారి సైడ్ఎఫెక్ట్స్ గురించి కూడా తెలుసుకోండి.
గుజ్జు..
కలబందలో రెండు రకాల పదార్థాలుంటాయి. ఒకటి ట్రాన్స్పరెంట్గా కనిపించే గుజ్జు. రెండోది పసుపు రంగులో కనిపించే లేటెక్స్. గుజ్జులో 96 శాతం నీరు, A, B, C, E విటమిన్లు ఉంటాయి. చాలామంది గుజ్జును షుగర్, హెపటైటిస్, బరువు తగ్గడానికి, జీర్ణకోశ వ్యాధులు, కడుపులో అల్సర్లు, ఆస్టియో ఆర్థరైటిస్, ఉబ్బసం, జ్వరం, దురద, వాపు వంటివి తగ్గించుకునేందుకు వాడతారు. స్కిన్‌కేర్‌గా, హెయిర్కేర్గా కూడా ఉపయోగిస్తారు. గుజ్జుతో తయారుచేసిన జ్యూస్‌ను ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడతారు.
లేటెక్స్ సైడ్ఎఫెక్ట్స్…
కలబంద లేటెక్స్ పసుపు రంగులో ఉంటుంది. ఆకు పైపొర కింద నుంచి తీస్తారు. తక్కువ మోతాదులోనైనా లేటెక్స్‌ను తాగడం మంచిదికాదు. దీనివల్ల కిడ్నీ సమస్యలు, కడుపునొప్పి, పొటాషియం లెవెల్స్ పడిపోవడం వంటి సైడ్ఎఫెక్ట్స్ కలుగుతాయి. ఇవే కాకుండా మరెన్నో సైడ్ఎఫెక్ట్స్ ఉన్నాయి.
అలర్జీ..
అదేపనిగా రోజూ కలబంద గుజ్జు వాడితే స్కిన్ అలర్జీ, వాపు, దద్దుర్లు , కనురెప్పలు ఎర్రబడడం, చర్మం పొడిబారడం, గట్టిపడటం, ఊదా రంగు మచ్చలు ఏర్పడటం, చర్మం పగలడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
షుగర్ లెవెల్స్ పడిపోతాయి..
అలోవెరా రక్తంలో షుగర్ లెవెల్స్ ను ఒక్కసారిగా తగ్గించేస్తుంది. అందుకే షుగర్ ఉన్నవారు కలబందను జాగ్రత్తగా వాడాలి. షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోతే ప్రాణాపాయం ఉంది.
లివర్ సమస్యలు..
కలబంద జ్యూస్ అతిగా తాగితే లివర్ ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుంది. కారణం.. అలోవెరాలో ఉండే సి-గ్లైకోసైడ్స్, యాంత్రక్వినోన్స్, యాంత్రోన్స్, లెక్టిన్స్, పోలిమన్నన్స్, ఎసిటైలేటెడ్ మన్నన్స్ వంటి అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు కాలేయం పనితీరుని దెబ్బతిస్తాయి.
కిడ్నీ సమస్యలు..
సాధారణంగా మనం వాడే పెయిన్ కిల్లర్స్, జ్వరం తగ్గడానికి వాడే యాంటిబయాటిక్స్‌తో కలబంద కలిసి కొన్నిరకాల సైడ్‌ఎఫెక్ట్స్‌కు కారణమవుతుంది. కలబందలో ఉండే లేటెక్స్ కిడ్నీలపై ఒత్తిడి పెంచుతుంది.
ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్..
అధిక మొత్తంలో కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల విరేచనాలు, అతిసారం మరియు తీవ్రమైన కడుపు నొప్పి కలిగి , ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్‌కు దారితీస్తుంది.
కడుపులో ఇబ్బంది..
కలబంద రసం తాగడం వల్ల కడుపులో ఇబ్బందులు తలెత్తుతాయి. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడేవారు కలబందకు దూరంగా ఉండడం లేదా మితంగా వాడడం మంచిది. కొన్నిరకాల పేగు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు కలబంద కారణంగా మరింత ఇబ్బంది పడతారు.
హెమరాయిడ్స్ ఉంటే జాగ్రత్త..
కడుపులో హెమరాయిడ్స్ ఉన్నవారు కలబంద జోలికే వెళ్లొద్దు. ఆపరేషన్ చేసే సమయంలో, చేసిన తర్వాత షుగర్ లెవెల్స్ పడిపోవడానికి, పెరగడానికి కలబంద కారణమవుతుంది. అందుకే ఆపరేషన్లకు రెండువారాల ముందే కలబంద వాడడం మానేయాలి.
హార్ట్ పేషెంట్స్.. బీ కేర్‌ఫుల్..
కలబంద రసం తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను అధికం చేసే ‘అడ్రినలిన్’ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. పొటాషియం లెవెల్స్ తగ్గడంతో హార్ట్‌బీట్ దెబ్బతింటుంది.
మలబద్దకం..
ఎక్కువ కాలంపాటు కలబంద రసం తీసుకో వటం వల్ల మలబద్దకం వచ్చే అవకాశం ఉంది.
ఆరోగ్యంగా ఉన్నవారు మితంగా కలబంద వాడితే లాభమే. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం నిపుణుల సలహా మేరకే వాడాలి.
నిజానికి అలోవెరాలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే దానిని వాడే పద్ధతి, ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? అనే విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు. పేపర్లలో, టీవీల్లో, నెట్లో చూసి వాడేస్తుంటారు. ఫలితంగా అనేకరకాల సైడ్‌ఎఫెక్ట్స్‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చు. అందుకే నిపుణుల సలహా మేరకు వాడడం మంచిది. అయితే చాలారకాల అనారోగ్య సమస్యలకు అలోవేరా మందుగా పనిచేస్తుందని చెబుతారు. నిజానికి చాలావరకు సైంటిఫిక్‌గా ప్రూవ్ కాలేదు. అయితే అన్నింటికీ ఒకటే మందు అన్న రీతిలో అలోవెరాను వాడొద్దు. A,B,C,E విటమిన్లు ఉన్నం దున సంబంధిత విటమిన్ లోపాన్ని తగ్గించుకునేందుకు వాడొచ్చు. అంతేకానీ ఏ సమస్య వచ్చినా అలోవెరా వాడడమే పరిష్కారం కాదు.
– డాక్టర్ ఉదయ్ కిరణ్, ఫిజీషియన్, మోతీనగర్, హైదరాబాద్
సైడ్ఎ ఫెక్స్ట్ ..
అతిసారం, పొత్తికడుపులో నొప్పి, కండరాల బలహీనత, గొంతులో వాపు వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. కొన్నిసార్లు చూపు కోల్పోవడం కూడా జరగొచ్చట. అంతేకాదు కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది.