
హైదరాబాద్, వెలుగు: జైళ్లలోని ఖైదీల కస్టడీ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని జైలు సిబ్బందికి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) సౌమ్య మిశ్రా సూచించారు. ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ ప్రధాన సమస్యగా మారిందని..డ్రగ్స్ సంబంధిత కేసులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. చట్ట అమలు జైలు సిబ్బందికి కొత్త సవాళ్లు విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, సోమవారం డీజీ సౌమ్య మిశ్రా..చంచల్‌గూడలోని తెలంగాణ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్‌లో 'ఖైదీల కస్టడీ, శోధన' అంశంపై శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన 23 మంది జైలు సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్డీ) రూపొందించిన ఈ కోర్సులో సమర్థవంతమైన సెర్చ్ ప్రొసీజర్లు, సిబ్బంది అప్రమత్తతపై చర్చించారు.సౌమ్య మిశ్రా మాట్లాడుతూ... ఖైదీల కస్టడీ అనేది జైలు సిబ్బందికి అప్పగించిన అత్యంత సున్నితమైన, కీలకమైన బాధ్యతలలో ఒకటన్నారు.