
- రూ.225 కోట్లతో ఆర్టిఫిషియల్ గా నిర్మాణం!!
- కొత్వాల్ గూడా సమీపంలో 35 ఎకరాల్లో..
- పార్కులు, సైక్లింగ్ ట్రాక్‌లు, ఆట స్థలాలు
- పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు సన్నాహాలు
హైదరాబాద్: ముత్యాల నగరం హైదరాబాద్ పర్యాటక ప్రాంతాలకు నెలవు. అద్భుతమైన కట్టడాలు, ఆకట్టుకునే సంస్కృతి కనువిందు చేస్తాయి. బీచ్ అందాలను చూసే భాగ్యం మన భాగ్యనగరానికి లేదు. కారణం ఇక్కడ సముద్రం లేకపోవడమే. ఒకవేళ బీచ్ లో ఎంజాయ్ చేయాలనుకుంటే బాపట్ల జిల్లాలోని సూర్యలంకకు వెళ్లాల్సిందే.
ఇకపై హైదరాబాద్ లోనూ బీచ్ అందాలను చూసే అవకాశం ఉంది. కోత్వాల్ గూడ సమీపంలో బీచ్ అందాలు కనువిందు చేయబోతున్నాయి. అక్కడ ఓ భారీ ఆర్టిఫిషియల్ బీచ్ ను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను కూడా ఆవిష్కరించింది. 35 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండే ఈ ప్రాజెక్టులో బీచ్ లాంటి పరిసరాలతో మానవ నిర్మిత సరస్సును ఏర్పాటు చేయనున్నారు.
ఇది హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మారుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్ కింద రూ. 225 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మించబోతున్నారు . ఈ డిసెంబర్ లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
బంగీ జంప్.. పార్కులు
నిజమైన బీచ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా దీనిని నిర్మించనున్నారు. స్టార్ హోటళ్ళు, అద్భుతమైన స్టే హోటళ్లు. అలలపై తేలియాడే విల్లాలు ఆకట్టుకోనున్నాయి. బంగీ జంపింగ్, స్కేటింగ్, సెయిలింగ్, శీతాకాలపు క్రీడలు వంటి సాహస క్రీడలు ఉంటాయి. పార్కులు, ఆట స్థలాలు, సైక్లింగ్ జోన్లు, జాగింగ్ ట్రాక్ లతో సహా ఫ్యామిలీ ఎంజాయ్ చేసేలా ఉంటాయి.
ఫుడ్ కోర్టులు, థియేటర్లు, అలంకార ఫౌంటెన్లు, వేవ్ పూల్ లాంటి విశ్రాంతి స్థలాలు ఉంటాయి. బీచ్‌ను మాత్రమే కాకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే అన్ని సదుపాయాలనూ ఏర్పాటు చేయబోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న నేపథ్యంలో కనెక్టివిటీకి ఈజీగా ఉంటుందని కొత్వాల్ గూడాను ఎంచుకున్నారు.