- హార్వర్డ్ విద్యార్థులకు సీఎం రేవంత్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ వేదికలపై తెలం గాణ కీర్తిని చాటిచెప్పేందుకు హార్వర్డ్ విద్యార్థులు బ్రాం డ్ అంబాసిడర్లుగా మారాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (హెచ్‌బీఎస్)లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల ఆహ్వానం మేరకు సీఎం వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 'తెలంగాణ రైజింగ్' పేరిట రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని వారికి వివరించారు.
హార్వర్డ్ వేదికగా విద్యార్థులు ఆర్జించిన మేధస్సును, అక్కడి విస్తృతమైన నెట్‌వర్క్‌ను దేశాభివృద్ధికి, తెలంగాణ ప్రగతికి వినియోగించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న అపార అవకాశాలను, ఇక్కడి బలాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా నిమిషం తీరిక లేని బిజీ షెడ్యూల్‌తో గడుపుతున్నప్పటికీ.. విద్యార్థుల కోరిక మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీకి సమయం కేటాయించారు.
తరగతులు, అసైన్‌మెంట్లు పూర్తి చేసుకున్న అనంతరం విద్యార్థులతో ఆయన ఆత్మీయంగా ముచ్చటించారు. వారి కెరీర్ లక్ష్యాలు, విద్యాభ్యాసంలో ఎదురవుతున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. కేవలం కుశల ప్రశ్నలకే పరిమితం కాకుండా.. తన రాజకీయ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని అనుభవాలను జోడిస్తూ తన విజయ సూత్రాన్ని (సక్సెస్ మంత్ర) వారితో పంచుకున్నారు.
