శ్రీ యోగానంద లక్ష్మీ నర్సింహా స్వామి ఉత్సవాల్లో భక్తులపై తేనెటీగల దాడి

శ్రీ యోగానంద లక్ష్మీ నర్సింహా స్వామి ఉత్సవాల్లో భక్తులపై తేనెటీగల దాడి
  • 50 మందికి గాయాలు.. 
  • ఆరుగురికి సీరియస్
  • వికారాబాద్ రాకంచర్ల జాతరలో ఘటన

పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని రాకంచర్లలో జరుగుతున్న శ్రీ యోగానంద లక్ష్మీ నర్సింహా స్వామి ఉత్సవాల్లో భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఆదివారం జాతరకు వచ్చిన భక్తులపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో సుమారు 50 మంది గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆలయ ప్రాంగణంలో బస చేసిన భక్తులు ఆదివారం ఉదయం టిఫిన్ వండుకోవడానికి పొయ్యి వెలిగించగా, ఆ పొగ తగలడంతో పక్కనే ఉన్న తేనెటీగలు లేచి అందరిపై విరుచుకుపడ్డాయి.

ఈ దాడితో భయభ్రాంతులకు గురైన భక్తులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. గాయపడిన వారిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ ఉత్సవాల్లో ఈ ఘటన జరగడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.