బీర్లు దొర్కుతలేవ్​..వేసవితాపం, ఎన్నికలతోఫుల్ ​డిమాండ్​

బీర్లు దొర్కుతలేవ్​..వేసవితాపం, ఎన్నికలతోఫుల్ ​డిమాండ్​
  • ప్రస్తుతం రోజుకు 27 లక్షల బాటిళ్లు సప్లై
  • ఇట్ల స్టాక్​ రాంగనే అట్ల అమ్ముడుపోతున్నయ్
  • కొన్ని చోట్ల నిలిచిన బీర్ల ఉత్పత్తి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడింది. చాలినన్ని బీర్లు దొరక్క మద్యం ప్రియులు అసంతృప్తి చెందుతున్నారు. ఎండలు పెరగడం, ఐపీఎల్, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీర్లకు డిమాండ్  పెరిగింది. డిమాండ్​కు తగిన సప్లై లేకపోవడంతో చాలా చోట్ల వైన్  షాపులలో నో స్టాక్​ బోర్డులు పెడుతున్నారు. 
రాష్ట్రంలో రోజూ సగటున 27 లక్షల బీర్లు అమ్ముడవుతున్నాయి. కానీ, దీనికి డబుల్​ డిమాండ్​ ఉందని వైన్స్, బార్ల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో 15 రోజుల పాటు రోజు కు కోటి చొప్పున బీర్లు సప్లై చేస్తేనే కొరత తీర్చగలమని తెలిపారు.

సమ్మర్​  కావడంతో బీర్లు సాధారణంగానే ఎక్కువగా అమ్ముడుపోతాయి. అయితే, ఈసారి ఊహించిన దానికన్నా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. మార్చి, ఏప్రిల్​ నెలల్లోనే కోటికి పైగా కేస్​ల బీర్లు సేల్​ అయ్యాయి. అంటే దాదాపు 13 కోట్ల బీర్లు తాగేశారు. డిమాండ్​కి తగినట్లు సప్లై చేస్తే మే ఒక్క నెలలోనే ఈ స్థాయిలో అమ్మకాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. 

రెండు గంటల్లోనే స్టాక్ ఖతం

ఎండకాలం చల్లని బీరు తాగేందుకు మద్యం ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. దానికి తోడు ఐపీఎల్​ రావడంతో మధ్యాహ్నం నుంచే మ్యాచ్​లు వీక్షిస్తూ బీర్లు సేవిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీలు దాటడంతో బీర్లకు డిమాండ్  పెరుగుతోంది. అయితే వైన్స్​లలో సరిపడా బీర్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో నిర్వాహకులు ‘నో స్టాక్’​ బోర్డులు పెడుతున్నారు. స్టాక్​ వచ్చిన రెండు గంటల్లోనే బీర్లన్నీ అమ్ముడుపోతున్నాయి. చల్లగా లేకపోయినా కొనుక్కుని వెళ్తున్నారంటే ఎంత డిమాండ్​ ఉందో అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రంలో బీర్లు ఉత్పత్తి చేసే కంపెనీలకు బేవరేజెస్ ​ కార్పొరేషన్​ నుంచి బిల్లులు బాకీలు ఉన్నాయి. దీంతో కొన్నిచోట్ల బీర్ల ఉత్పత్తి నిలిచిపోయినట్లు తెలిసింది. దీంతో  డిమాండ్ కు తగినట్లు బీర్లు సప్లై కావడం లేదు. మరోవైపు బీర్ల ఉత్పత్తికి అవసరమైన నీటి సరఫరా విషయంలోనూ ఇబ్బందులు ఉండడం కొరతకు కారణంగా చెబుతున్నారు. 

రోజుకు 3 లక్షల బీర్లు తాగుతున్నరు

నిరుటితో చూస్తే ఈసారి రోజుకు 3 లక్షల బీర్లు ఎక్కువగా తాగుతున్నారు. అది కూడా బీర్లు అందుబాటులో ఉన్నంత వరకే. పూర్తి స్థాయిలో స్టాక్​ పెడితే, తాగుడు ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు.