అజారుద్దీన్ పై పోలీసులకు క్షతగాత్రుల ఫిర్యాదు

అజారుద్దీన్ పై పోలీసులకు క్షతగాత్రుల ఫిర్యాదు

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రెసిడెంట్ అజారుద్దీన్ తో పాటు హెచ్సీఏ నిర్వాహకులపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 25న హైదరాబాద్ లో జరగనున్న భారత్ –ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి జింఖానా గ్రౌండ్ లో  జరిగిన తొక్కిసలాటలో గాయపడిన అదితి ఆలియా, ఎస్ఐ ప్రమోద్ ఫిర్యాదు మేరకు సెక్షన్ 420, సెక్షన్ 21, సెక్షన్ 22/76 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. భారత్ –ఆస్ట్రేలియా మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను బ్లాక్ లో అమ్ముకున్నారంటూ అజారుద్దీన్ పై ఆరోపణలు వచ్చాయి. టికెట్ల అమ్మకంలో సరైన జాగ్రత్తలు పాటించలేదని, అందువల్లే తొక్కిసలాట జరిగిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెసీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇలా జరిగేది కాదని వారు ఆరోపిస్తున్నారు.

కాగా... ఈ నెల 25వ తేదీన ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-, ఆసీస్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో టికెట్ల అమ్మకాల కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్లు విక్రయిస్తున్నారు. మ్యాచ్‌ టికెట్ల కోసం ఉదయం నుంచే అభిమానులు బారులు తీరారు. టికెట్లు కొనుక్కునేందుకు ప్యారడైజ్‌ సర్కిల్ నుంచి జింఖానా వరకు క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. అంచనాలకు మించి వేలాదిగా క్రికెట్ ఫ్యాన్స్ రావడంతో వాళ్లను నియంత్రించేందుకు పోలీసులు చాలా అవస్థలు పడ్డారు. ఉదయం నుంచే టికెట్లు అమ్ముతున్నప్పటికీ.. బాగా ఆలస్యం జరుగుతుండటంతో అభిమానలు ఆగ్రహంతో ఊగిపోయారు. టికెట్స్ దొరుకుతాయో లేదోననే టెన్షన్ తో పాటు కౌంటర్ బంద్ చేస్తారంటూ జరిగిన ప్రచారం జరిగింది. అంతే కాకుండా కేవలం 800, 1200 రూపాయలకే టికెట్లు అమ్మడంతో అభిమానుల్లో మరింత ఆందోళన పెరిగింది.

దీంతో అంతా ఒక్కసారిగా కౌంటర్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. మెయిన్‌ గేట్‌ వైపు నుంచి ఒక్కసారిగా తోసుకుని రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంతమంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్ కు మధ్య జరిగిన తోపులాటలో పలువురు యువతులు స్పృహ తప్పి పడిపోయారు. గాయపడిన వారిని వెంటనే సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు.