బీజింగ్: స్కూళ్లను మూసివేశారు.. బిల్డింగ్‌లు, కమ్యూనిటీ సంఘాల భవనాలకు తాళాలేశారు.. సామూహిక కరోనా పరీక్షలు చేస్తున్నారు.. ఫుడ్ తెచ్చుకోవడానికి సూపర్ మార్కెట్లకు జనం పరుగులు తీస్తున్నారు.. ఇదంతా ఇంతకుమందు చైనాలోని షాంఘై నగరంలో కనబడిన చిత్రాలు.. ఇప్పుడు బీజింగ్‌లోనూ అవే పరిస్థితులు కనిపిస్తున్నయ్. ఒమిక్రాన్ వేరియంట్ చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. భారీగా పెరుగుతున్న కేసులతో చైనా నగరాలు అతలాకుతలం అవుతున్నయ్. కేసులు పెరుగుతున్న ప్రతిచోట లాక్‌డౌన్ పెట్టి వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నరు. దాదాపు నెల రోజులుగా షాంఘైలో లాక్‌డౌన్ పెట్టి, వైరస్‌ను కట్టడికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం... బీజింగ్‌లోనూ ఇదే అమలు చేయాలని చూస్తోంది. అయితే దేశంలో పలు ప్రాంతాల్లో విధిస్తున్న లాక్‌డౌన్‌తో అధికార కమ్యూనిస్ట్ పార్టీలో రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. అయితే, దేశంలో వైరస్ కట్టడికి జీరో కొవిడ్ విధానాన్ని కొనసాగిస్తామని పార్టీ పొలిట్ బ్యూరో శుక్రవారం మళ్లీ చెప్పింది. లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా నష్టపోతున్న విషయాన్ని అంగీకరించింది. అయితే జీరో కొవిడ్ విధానం అమలు చేస్తున్నందునే మరణాలు తక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించింది. ఈ టైమ్‌లో దేశంలో కరోనా రూల్స్‌ను సడలిస్తే కచ్చితంగా తక్కువ సమయంలోనే కేసులు భారీ సంఖ్యలో పెరిగి, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. కాగా, షాంఘైలో గురువారం మరో 52 మంది వైరస్‌తో చనిపోయారు. దీంతో మొత్తం మరణాలు 337కు పెరిగాయి. షాంఘైలో గురువారం కొత్తగా 15 వేల కేసులు నమోదయ్యాయి.
