గళమెత్తుతున్న సివిల్​ సర్వెంట్లు

గళమెత్తుతున్న సివిల్​ సర్వెంట్లు

కీలక పోస్టుల్లో పనిచేసి, జనంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమకు అప్రాధాన్య పోస్టుల్లోకి బదిలీ చేస్తున్నారని సివిల్​ సర్వెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరొకరుగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. మొన్నటికి మొన్న ఐపీఎస్​ అధికారి వీకే సింగ్​ ఇదే అంశాన్ని లేవనెత్తగా.. ఇప్పుడు ఐఏఎస్​ అధికారి ఆకునూరి మురళి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జైళ్ల శాఖ డీజీగా పనిచేసిన వీకే సింగ్​ను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రింటింగ్‌‌ అండ్‌‌ స్టేషనరీ విభాగం కమిషనర్ గా ట్రాన్స్​ఫర్​ చేసింది.  బుధవారం ఆ విభాగం బాధ్యతలు చేపట్టగానే మీడియాతో మాట్లాడుతూ.. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం ప్రభుత్వానికి భారంగా మారిందని, రూ.2 కోట్ల పనికోసం రూ.50 కోట్లు అనవసరంగా ఖర్చు చేస్తున్నట్టు గుర్తించానని చెప్పారు. తాను సెలవులో ఉండగా ట్రాన్స్ ఫర్ చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. మూడేండ్ల కిందే ఉద్యోగానికి రాజీనామా చేసి సామాజిక కార్యక్రమాలు చేద్దామనుకున్నానని చెప్పారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో పెద్దగా పని ఉండదని, అందువల్ల సరికొత్త విజన్ కు శ్రీకారం చుడతానని తెలిపారు. రాష్ట్ర జైళ్ల శాఖలో ఐదేండ్ల పాటు డీజీగా పనిచేసిన వీకే సింగ్… దేశంలో ఎక్కడా లేనివిధంగా జైళ్ల శాఖలో సంస్కరణలు చేపట్టారు. ఖైదీలకు జీవనోపాధిలో శిక్షణ అందజేశారు. జైలు ఉత్పత్తుల టర్నోవర్​ను వందల కోట్లకు తీసుకెళ్లారు. ఆనందాశ్రమం ఏర్పాటు చేసి 15 వేల మంది యాచకులకు ఆశ్రయం కల్పించారు.