
ఏప్రిల్22 పహల్గాం ఉగ్రదాడికి మూలం..26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రమూకల స్థావరం..ట్రైనింగ్ ఇవ్వడం భారత్ లో విధ్వంసానికి కుట్ర చేయడం..ఇదే లష్కరే తోయిబా దుర్బుద్ధి. లష్కరే తోయిబా శిక్షణ స్థావరాలను భారత సైన్యం కనిపెట్టింది..పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఈ ఉగ్రవాదుల స్థావరాలను శాటిలైట్ ద్వారా గుర్తించింది. లష్కరే తోయిబా ఉగ్రవాద శిక్షణ స్థావరాలను ఫొటోలను ఆర్మీ ఆదివారం (మే 4) విడుదల చేసింది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద శిక్షణా శిబిరం ఉనికిని బయటపెట్టింది ఆర్మీ. శాటిలైట్ ద్వారా ఉగ్ర స్థావరాలను భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ఏప్రిల్ 22 పహల్గాం దాడికి ఇక్కడినుంచే కుట్ర జరిగినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి.
'జంగల్ మంగళ్ క్యాంప్' అని పిలువబడే ఈ శిక్షణా కేంద్రం పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మన్సెహ్రా జిల్లాలోని అటార్ సిసా అనే పట్టణంలో ఉంది. నిఘా వర్గాల ప్రకారం..ఈ శిబిరం చాలా కాలంగా ఎల్‌ఇటి ఉగ్రవాదులకు కీలక శిక్షణా కేంద్రంగా పనిచేస్తోంది.
ఈ శిబిరంలో నివాస ప్రాంతం, మసీదు, అతిథి సమావేశ మందిరాలు,విదేశీ ఉగ్రవాదులకు నియమించబడిన శిక్షణా మైదానం ఉన్నాయి. ఉపగ్రహ ఫొటోలలో ఈ శిక్షణా స్థావరానికి సమీపంలో ఒక సైనిక సంస్థ భవనం కూడా కనిపిస్తుంది. ఇది ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం నుంచి రక్షణను ఇస్తున్నట్లు సూచిస్తుంది.
ఈ క్యాంప్ కాంప్లెక్స్‌లో లష్కరే కమాండర్లు,పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మధ్య ఉన్నత స్థాయి సమావేశాలు తరచుగా జరుగుతాయని నిఘావర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అప్పుడప్పుడు ఈ సమావేశాలకు హాజరవుతున్నట్లు సమాచారం.ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన దాడి తర్వాత ఈ కొత్త విషయాలు వెల్లడయ్యాయి.