
ఢిల్లీ నుంచి టెల్ అవీవ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం దారి మళ్లించారు. ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ ఎయిర్ పోర్టుపై బాలిస్టిక్ క్షిపణి దాడి జరిగింది. పెద్దగా నష్టం జరగకపోయినప్పటికీ విమానాల రాకపోకలను నిలిపివేశారు.
దీంతో ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని దారి మళ్లించారు. ఆదివారం(మే 4) ఉదయం జరిగిన ఈ దాడి తర్వాత ఎయిర్ ఇండియా విమానం AI 139ని అబుదాబికి మళ్లించారు. ఈ విమానం శనివారం ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ కు బయలుదేరింది. బెన్ గురియన్ విమానాశ్రయంలో మరో గంటలో ల్యాండ్ అవుతుందనగా ఈ క్షిపణి దాడి జరిగింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసింది. హమాస్ కు మద్దతుగా యెమెన్ ఇజ్రాయెల్ తో ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. ఈక్రమంలో ఆదివారం యెమెన్ కు చెందిన బాలిస్టిక్ క్షిపణి ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ ఎయిర్ పోర్టు కు సమీపంలో పడింది. ఈ క్షిపణి దాడిలో పెద్దగా నష్టం జరగలేదు..రోడ్లు ధ్వంసమయ్యాయని ఇజ్రాయెల్ వర్గాలు తెలిపారు.
క్షిపణి దాడిలో బెన్ గురియన్ ఎయిర్ పోర్టులో టెర్మినల్ 3 సమీపంలో భవనాలు, నిలిపి ఉంచిన విమానాల వెనక దట్టమైన పొగలు వస్తున్నట్లు వీడియాల్లో కనిపిస్తోంది. ఇద్దరికి స్వల్పగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.
అబుదాబిలో ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా AI139 విమానం ఢిల్లీ కి వచ్చేందుకు రీషెడ్యూల్ చేయాల్సి ఉంది. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు రీషెడ్యూల్, లేదా ఫుల్ పేమెంట్ ద్వారా రద్దు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధులు వెల్లడించారు.
మే 3నుంచి 6 తేదీల మధ్య ఎయిర్ ఇండియా విమానాలను బుక్ చేసుకున్న ప్యాసింజర్లకు రీషెడ్యూల్, లేదా ఫుల్ పేమెంట్ వాపసులతో రద్దు చేసుకునేందుకు మినహాయింపు ఇచ్చారు. ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఎయిర్ లైన్ కస్టమర్లకు సాయం అందిస్తున్నట్లు తెలిపింది.