
- 11 అంకెలతో ప్రత్యేక నంబర్ కేటాయింపు
- ఐడీతో ఆధార్, పట్టాదారు పాస్‌బుక్, ఫోన్ నంబర్ లింక్
- భూమి రకం, పంటల సాగు వివరాలు నమోదు
- కేంద్ర అగ్రికల్చర్ స్కీమ్‌లకు కీలకం కానున్న ‘ఫార్మర్ ఐడీ’
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఫార్మర్ ఐడీ’ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కింద ప్రతీ రైతుకు11 నంబర్ల యూనిక్ ఐడీ కేటాయించి.. వారికి ఉన్న భూమి రకం, సాగు, వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుంది. ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ల(ఏఈఓ)కు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం మే 5 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఏమిటీ ఫార్మర్ ఐడీ?
ఫార్మర్ ఐడీ అనేది రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు. ఇది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది. ఈ 11 అంకెల ఐడీలో రైతు పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పట్టాదారు పాస్‌బుక్ వివరాలు, భూమి రకం(ఎర్ర నేల, నల్ల నేల, తరి, మెట్ట), సర్వే నెంబర్లు, సాగు చేసిన పంటలు తదితర సమాచారం నమోదు చేస్తారు. ఈ ఐడీ ద్వారా రైతు సాగు వివరాల చిట్టా అంతా ఒకే క్లిక్‌తో తెలుసుకోవచ్చు. కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డు, ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఇది తప్పనిసరి కానుంది.
ఈ ఐడీ లేకుండా రైతులకు ఇకపై ఈ పథకాల ప్రయోజనాలు లభించవు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు ఈ ఫార్మర్ ఐడీ అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.
మే 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏఈఓలు రైతుల నుంచి వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభిస్తారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, మొబైల్ నెంబర్‌తో స్థానిక ఏఈఓను సంప్రదించాలి. అలాగే భూమి వివరాలు, సాగు చేసిన పంటల సమాచారాన్ని అందించాలి. ఈ వివరాలను వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. యాప్‌లో వివరాలు ఎంటర్ చేసిన తర్వాత, రైతు మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని యాప్‌లో నమోదు చేయగానే 11 అంకెల ఫార్మర్ ఐడీ జనరేట్ అవుతుంది.
ఫార్మర్ ఐడీ ప్రయోజనాలివీ..
ఫార్మర్ ఐడీ ద్వారా కేంద్ర పథకాల ప్రయోజనాలు వేగంగా, పారదర్శకంగా అందుతాయి. ప్రకృతి విపత్తుల సమయంలో ఐడీ నంబర్ ఎంటర్ చేస్తే రైతు సాగు వివరాలు తెలుస్తాయి. పదే పదే డాక్యు మెంట్లు సమర్పించాల్సిన అవసరం, పేపర్ వర్క్ లేకుండా ఒకే ఐడీతో అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయ విధానాల రూపకల్పనలో ఈ డిజిటల్ డేటా సర్కారుకు సహాయపడనుంది.
రాష్ట్రంలో 70 లక్షలకు పైగా రైతులు..
రైతు భరోసా డేటా ప్రకారం రాష్ట్రంలో 70 లక్షల కు పైగా రైతులు ఉన్నారు. వీరిలో దాదాపు 32.11లక్షల మంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మా న్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ లబ్ధిదారులు 10.09 కోట్ల మంది ఉండగా, ఇప్పటివరకు 5.82 కోట్ల మంది రైతులకు ఫార్మర్ ఐడీని అందించినట్లు అధికారులు చెప్తున్నారు.