
Gold Rate: ఆగస్టు నెల ప్రారంభం నుంచి 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు లక్షకు పైనే కొనసాగుతోంది. దీనికి కొన్ని కీలకమైన కారణాలను పరిశీలిస్తే ముందుగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లను సెప్టెంబరులో తగ్గించవచ్చనే అంచనాలు ఒకటి. దీనికి తోడు అమెరికాలో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం కూడా డాలర్ రేటును పతనం చేస్తోంది. సాధారణంగా డాలర్ వీకైనప్పుడు గోల్డ్ రేట్లు పెరుగుతుంటాయి. ఎందుకంటే సేఫ్ హెవెన్ బంగారానికి ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి.
జూలైలో అమెరికా ద్రవ్యోల్బణం చాలా తక్కువ పెరుగుదలను సూచించటంతో ఈసారి ఫెడ్ సెప్టెంబర్ సమావేశంలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. ఈసారి అది 50 బేసిస్ పాయింట్ల వరకు ఉండొచ్చని వారు అంటున్నారు. ఇదే జరిగితే బాండ్ ఈల్డ్స్ తగ్గుతాయి. దీంతో ఇన్వెస్టర్లు బంగారం వంటి ఇతర పెట్టుబడుల్లోకి తమ డబ్బును పంప్ చేస్తారు. పైగా ప్రస్తుతం టారిఫ్స్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్ టెన్షన్స్ పెరుగుతున్న క్రమంలో డాలర్ విలువ కూడా పతనం కావటం బంగారాన్ని మరింత ప్రియంగా మార్చేస్తోందని మెహతా ఈక్విటీస్ నిపుణులు రాహుల్ కలాంత్రి చెప్పారు.
ALSO READ : 8 రూపాయల చిల్లరను కోటి చేసిన క్రిప్టో..
అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు చాలా కాలం నుంచి తమ ఆర్థిక వ్యవస్థలను స్టేబుల్ గా ఉంచేందుకు గోల్డ్ కొనుగోలు చేయటం దీర్ఘకాలికంగా రేట్లలో ర్యాలీకి మరో కారణంగా ఎంకే గ్లోబల్ రీసెర్చ్ అనలిస్ట్ రియా సింగ్ చెప్పారు. 2025లో మెుదటి ఆరు నెలల కాలంలోనే సెంట్రల్ బ్యాంకులు ఏకంగా 290 టన్నులు గోల్డ్ కొనుగోలు చేశాయి. ఈ ఏడాది మెుత్తం తవ్వి తీసిన బంగారంలో ఇది 15 శాతానికి సమానం అని సింగ్ చెప్పారు. ట్రంప్ టారిఫ్స్ తర్వాత గోల్డ్ ఔన్సు రేటు 3వేల 534 డాలర్ల రికార్డు రేటుకు చేరగా.. ఆగస్టు 15న ట్రంప్ పుతిన్ మధ్య అలాస్కాలో జరిగే మీటింగ్ పసిడి రేట్ల భవిష్యత్తుకు ఒక ట్రిగర్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే గోల్డ్ రేట్లలో ర్యాలీ ముగియటానికి ఇంకా చాలా దూరం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా రిటైల్ వినియోగదారుల కంటే పెట్టుబడిదారుల నుంచే ఎక్కువగా బంగారానికి డిమాండ్ ఉండటం రేట్ల పెరుగుదలను ప్రేరేపిస్తోందని రియా సింగ్ అన్నారు. ఒక వేళ ఫెడ్ నిజంగానే రేట్ల తగ్గింపును ప్రకటిస్తే రానున్న కాలంలో ఔన్సు బంగారం రేటు 3వేల 500 డాలర్ల నుంచి 3వేల 600 డాలర్ల మధ్యకు చేరుతుందని అంచనాలను పంచుకున్నారు రియా సింగ్. ప్రస్తుతం గోల్డ్ పై పెట్టుబడులు ఉన్న ఇన్వెస్టర్లు లాభాలు బుక్కింగ్ కోసం ప్రయత్నించటం మంచిదని ఆమె సూచించారు. ఇక కొత్త ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గోల్డ్ పెట్టుబడుల విషయంలో ముందుకు సాగటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.