
Swiggy Platform Fee Hike: ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావటంతో చాలా మంది కనీసం కిలోమీటరు దూరంలో వెళ్లి వస్తువులు తెచ్చుకోవాలన్నా బద్దకంగా ఫీలవుతున్నారు. ఎందుకులే స్విగ్గీ, జొమాటో లాంటి క్విక్ కామర్స్ సంస్థలు కాళ్లకాడికే ఆర్డర్స్ డెలివరీ చేస్తుంటే మనం ఇంట్లో నుంచి బయటికి పోవుడు దేనికి అనుకుంటున్నారు. బిస్కెట్ ప్యాకెట్ కావాలన్నా లేదా బంగారు బిస్కెట్ కొనాలన్నా సింపుల్ గా ఫోన్ తీసి యాప్స్ ద్వారా ఆర్డర్ చేసి నిమిషాల్లో ఇంటి వద్దకే వాటిని తెప్పించుకుంటున్నారు.
దీంతో తమ సేవలకు భారీగా డిమాండ్ పెరగటాన్ని స్విగ్గీ సంస్థ కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ప్రధానంగా పండుగల సమయంలో ఏదో ఒక చిన్న వస్తువు మర్చిపోయినా చాలా మంది ఆర్డర్ చేస్తుంటారు. అందుకే ఈ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనినే అదునుగా మార్చుకుంటోంది ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ. కంపెనీ ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ లో ఫ్లాట్ ఫారం ఫీజును గతంలో ఉన్న రూ.12ను మరో రెండు రూపాయలు పెంచి రూ.14గా మార్చేసింది. దీంతో కంపెనీ అదనపు ఆదాయాన్ని పొందాలని భావిస్తోంది.
తొలిసారిగా స్విగ్గీ 2023 ఏప్రిల్ నెలలో ఫ్లాట్ ఫారం ఫీజులు వసూలు చేయటం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి నుంచి అదును దొరికినప్పుడల్లా వాటిని క్రమంగా పెంచుకుంటూ పోతోంది. రోజూ స్విగ్గీ దాదాపు దేశంలో 20 లక్షల ఆర్డర్స్ డెలివరీ చేస్తుంది. దీంతో ప్రస్తుతం పెంపు ద్వారా రోజుకు రూ.2కోట్ల 80 లక్షలు అదనంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టనుంది. అంటే ఏడాదికి దాదాపు రూ.33కోట్ల 60 లక్షలు వస్తాయి. అయితే పండుగల సీజన్ అయిపోయాక కంపెనీ మళ్లీ పాత రూ.12 ఫ్లాట్ ఫారం ఫీజుకు తిరిగి వెళ్లే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.
►ALSO READ | అగ్నివీర్స్ కోసం SBI స్పెషల్ లోన్ స్కీమ్.. ప్రాసెంసింగ్ ఫీజు జీరో..!
గతంలో కూడా స్విగ్గీ, జొమాటోలు ఇలా పండుగలు లాంటి పీక్ సీజన్ లలో ఫ్లాట్ ఫారం ఫీజులను పెంచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా నష్టాలు పెరుగుతున్న సమయంలో స్విగ్గీ ఇలా ఛార్జీల పెంపులకు దిగటం కనిపించింది. జూలైతో ముగిసిన త్రైమాసికంలో స్విగ్గీ నికర నష్టం అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే 96 శాతం పెరిగి రూ.వెయ్యి 197 కోట్లకు చేరుకుంది. క్విక్ కామర్స్ వ్యాపార విస్తరణ కోసం వేగంగా అడుగులు వేస్తున్న స్విగ్గీ నష్టాలను కూడా అదే స్థాయిలో పెంచుకుంటోంది. మరోపక్క జొమాటో మాత్రం లాభాల బాట పట్టి తొలి త్రైమాసికంలో రూ.25 కోట్ల ప్రాఫిట్ నమోదు చేసింది.