Allu Arjun: 'డిస్కో డ్యాన్సర్ 2'లో హీరోగా అల్లు అర్జున్? సీక్వెల్‌కు లైన్ క్లియర్!

Allu Arjun: 'డిస్కో డ్యాన్సర్ 2'లో హీరోగా అల్లు అర్జున్?  సీక్వెల్‌కు లైన్ క్లియర్!

1982లో విడుదలైన 'డిస్కో డ్యాన్సర్' మూవీ ఒక సంచలనం.  ఈ సినిమాలో పాటలు, డ్యాన్స్ స్టెప్పులు, కథ ఇలా ప్రతి ఒక్కటి అప్పట్లో ఒక ట్రెండ్ గా మారింది. రాత్రికి రాత్రే  మిథున్ చక్రవర్తిని బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా నిలబెట్టింది. ఈ చిత్రం యువతతో ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.  ఇప్పటికీ ఆ సినిమా పాటలు ఎక్కడ వినిపించినా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. అలాంటి ఒక క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ వస్తుందంటే సినీ ప్రియులకు అంతకు మించిన గుడ్ న్యూస్ మరొకటి ఉండదు. లేటెస్ట్ గా ఈ సినిమా దర్శకుడు బి. సుభాష్ ఈ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

'డిస్కో డ్యాన్సర్' నాదే..
గత రెండు సంవత్సరాలుగా 'డిస్కో డ్యాన్సర్' కాపీరైట్ విషయంలో షెమరూ ఎంటర్‌టైన్‌మెంట్, దర్శకుడు బి. సుభాష్ మధ్య న్యాయపరమైన వివాదం నడుస్తోంది. ఈ సినిమా హక్కులు ఎవరికి అనే విషయంలో కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చివరికి, ఆగస్టు 12న బొంబాయి హైకోర్టు ఈ కేసులో సుభాష్‌కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనితో 'డిస్కో డ్యాన్సర్' సీక్వెల్ తీసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. తీర్పు అనంతరం సుభాష్ మాట్లాడుతూ.. ఈ సినిమా విషయంలో కొన్ని హక్కులను షెమరూకి ఇచ్చినా..  రచయితగా , దర్శకుడిగా పూర్తి హక్కులు నావే. కోర్టు కూడా నా వాదనను సమర్థించింది అని తెలిపారు.

రణబీర్ లేదా అల్లు అర్జున్?
'డిస్కో డ్యాన్సర్ 2'లో హీరో పాత్ర గురించి బి. సుభాష్ మాట్లాడుతూ.. కొత్త తరం 'జిమ్మీ'గా ఇద్దరు హీరోలు తన దృష్టిలో ఉన్నారని తెలిపారు. వాళ్లిద్దరూ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు, నటనలోనూ మంచి పట్టు ఉన్నవాళ్లు. వారెవరంటే... రణబీర్ కపూర్ లేదా అల్లు అర్జున్. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు ఈ పాత్రకు కచ్చితంగా న్యాయం చేయగలరని నమ్ముతున్నాను అని చెప్పారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఈ ఇద్దరు స్టార్ హీరోల్లో ఎవరు ఈ పాత్రలో కనిపిస్తారు అనేది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విజయేంద్ర ప్రసాద్ కథ
'డిస్కో డ్యాన్సర్ 2' సీక్వెల్‌ కథ, స్క్రీన్‌ప్లే కోసం సుభాష్, ప్రముఖ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌ను సంప్రదించాలనుకుంటున్నట్లు చెప్పారు. గతంలో షెమరూతో వివాదం రాకముందు ఆయన కథ రాసేందుకు సిద్ధమయ్యారని, ఇప్పుడు మళ్లీ ఆయనతో సంప్రదింపులు జరుపుతామని సుభాష్ తెలిపారు. సినిమా దర్శకత్వం విషయానికొస్తే, నేను డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను, కానీ తుది నిర్ణయం హీరోను ఎంచుకున్న తర్వాతే ఉంటుంది అని స్పష్టం చేశారు.

1982లో బప్పీ లహిరి అందించిన సంగీతం, మిథున్ చక్రవర్తి నటన డిస్కో శకానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చాయి. ఇప్పుడు 'డిస్కో డ్యాన్సర్ 2' రాబోతుందనే వార్త ప్రేక్షకుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈసారి సంగీతం కొత్త తరం డ్యాన్సింగ్ స్టార్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి మరి..