
అమరావతి: ఏపీలోని విశాఖపట్టణంలో గురువారం (ఆగస్టు 14) ఘోర విషాదం చోటు చేసుకుంది. పర్యాటక ప్రాంతం ఆర్కే బీచ్ లో ముగ్గురు వ్యక్తులు సముద్రపు కెరటాల్లో కొట్టుకుపోయారు. వారిలో ఒక మహిళ మృతిచెందగా మరో యువకుడు గల్లంతయ్యాడు. మరో వ్యక్తిని అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించాడు.
పోలీసుల తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ నుంచి విశాఖకు పెళ్లి కార్యక్రమానికి వచ్చిన ఓ కుటుంబం సరదాగా ఆర్కే బీచ్‌కి విహారయాత్రకు వెళ్లింది. సాయంత్రం సమయానికి సముద్రంలో అలలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ఆ కుటుంబంలోని మహిళ నీటిలో కొట్టుకుపోయింది. ఆమెను రక్షించేందుకు కేరళకు చెందిన ఒక యువకుడు నీటిలోకి దూకగా అతడూ తిరిగి తీరానికి చేరుకోలేదు.
అప్పటికే పరిస్థితి తీవ్రతరం కావడంతో మరో వ్యక్తి కూడా కెరటాల్లో చిక్కుకున్నాడు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ ధైర్యంగా ముందుకు దూసుకెళ్లి ఆ వ్యక్తిని కాపాడాడు. రక్షణ సిబ్బంది, మత్స్యకారులు, కోస్ట్‌గార్డ్ సిబ్బంది మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
గల్లంతైన యువకుడు కేరళ రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించారు. మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు. ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గల్లంతయిన యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.