
మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. గ్రహాలు దాటి ప్రయాణిస్తున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంతో పురోగతి సాధిస్తున్నా పల్లెల్లో, పట్టణాల్లో అక్కడక్కడా మూఢ విశ్వాసాల నుంచి బయటకు రాలేకోపోతున్నారు. మంత్రాలు, చేతబడులు చేస్తున్నారనే నెపంతో సాటి మనిషిని దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తున్న ఘటనలు ఇంకా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మతి స్థిమితం లేని భర్త, నలుగురు పిల్లలతో కలిసి జీవితాన్ని నెట్టుకొస్తున్న మహిళను.. అందరూ చూస్తుండగా చెట్టుకు కట్టేసి చితకబాదాడు ఓ వ్యక్తి. గొర్రెల విషయంలో మొదలైన గొడవ చివరికి.. మంత్రాలు చేస్తోందనే నెపంతో అత్యంత కర్కషంగా చెట్టుకు కట్టేసి కొట్టే వరకు వచ్చింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ సవిత నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పని చేస్తోంది. అయితే అదే గ్రామానికి చెందిన సవిత బావ పల్లికొండ గంగారం గొర్రెలను పెంచుకుంటున్నాడు. గొర్రెలు తరచూ సవిత ఇంట్లోకి వచ్చి మూత్రవిసర్జన చేయడం, బియ్యం తినేయడం వంటివి చేస్తున్నాయి. దీంతో పలుమార్లు సవిత వారికి చెప్పినప్పిటికీ వారు పట్టించుకోకపోవడంతో గొడవ మొదలైంది.
ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో చివరకు గంగారాం కొట్టంలో ఉన్న గేదెను తీసుకొచ్చి గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద ఉన్న చెట్టుకు కట్టేసింది సవిత. దీంతో మా గేదెనే కట్టేస్తావా.. అంటూ గంగారాం, చంద్రంపల్లి లక్ష్మి, ఆయన కొడుకు గంగారాం, కోడలు మమత కలిసి సవితపై దాడికి దిగారు. మంత్రాలు చేస్తోందని ఆరోపిస్తూ చెట్టుకు కట్టేసి చితకబాదారు. మతిస్థిమితం కోల్పోయిన భర్త, నలుగురు పిల్లలతో కలిసి జీవితం నెట్టుకొస్తున్న సవిత గత్యంతరం లేక మోపాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని.. చివరకు సీపీ సాయిచైతన్యను కలిసి ఫిర్యాదు చేసేందుకు గురువారం (ఆగస్టు 14) సీపీ కార్యాలయానికి వచ్చినట్లు ఆమె పేర్కొంది.