SL vs IND: టీమిండియాకు షాక్ ఇచ్చిన శ్రీలంక.. ట్రై సిరీస్ లో భారత మహిళలకు తొలి ఓటమి

SL vs IND: టీమిండియాకు షాక్ ఇచ్చిన శ్రీలంక.. ట్రై సిరీస్ లో భారత మహిళలకు తొలి ఓటమి

వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా భారత మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం (మే 4) శ్రీలంక మహిళలతో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కొలంబోలోని ప్రేమ దాస్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో భారీ ఛేజింగ్ లో శ్రీలంక అద్భుతంగా ఆడింది. నీలాక్షి డిసిల్వా (56), హర్షిత్ సమర విక్రమ (53) హాఫ్ సెంచరీలతో శ్రీలంక 3 వికెట్ల తేడాతో టీమిండియాపై గెలిచి షాక్ ఇచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక 49.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసి గెలిచింది.

276 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక ఓపెనర్లు తొలి వికెట్ కు 31 పరుగులు జోడించి పర్వాలేదనిపించారు. ఈ దశలో హర్షిత్ సమారా విక్రమే, గుణరత్నే రెండో వికెట్ కు 78 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. 151 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించిన లంక ఆ తర్వాత అద్భుతంగా  రాణించారు. నీలాక్షి డిసిల్వా (56), హర్షిత్ సమర విక్రమ (53) హాఫ్ సెంచరీలతో జట్టును ముందుండి నడిపించారు. చివర్లో సంజీవని, కుమారి కీలక భాగస్వామ్యం నెలకొల్పి శ్రీలంకకు విజయాన్ని అందించారు. భారత స్పిన్నర్ స్నేహ్ రాణా 45 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి మరోసారి రాణించింది. 

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. వికెట్ కీపర్-బ్యాటర్ రిచా ఘోష్ 48 బంతుల్లో 5 బౌండరీలు మరియు మూడు సిక్సర్లతో 58 పరుగులు చేసి భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (30), ప్రతీకా రావల్ (35), జెమిమా రోడ్రిగ్స్ (37) కూడా మంచి సహకారం అందించారు. శ్రీలంక బౌలర్లలో సుగంధిక కుమారి, కెప్టెన్ చమరి అథపత్తు చెరో మూడు వికెట్లు పడగొట్టారు.