
IDL Explosives Stock: ప్రస్తుతం వార్తల్లో ఎక్కడ చూసినా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీయవచ్చనే నివేదికలు, వార్తా కథనాలతో నిండిపోయింది. ఈ క్రమంలోనే డిఫెన్స్ రంగానికి చెందిన కంపెనీలకు సంబంధించిన ఒక భారీ డీల్ వివరాలు బయటకు వచ్చాయి.
వివరాల్లోకి వెళితే రక్షణ రంగంలోని అపోలో మైక్రో సిస్టమ్స్ కంపెనీ తాజాగా ఐడీఎల్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు వెల్లడైంది. దీంతో సోమవారం అపోలో మైక్రో సిస్టమ్స్ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తాయని తెలుస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ డీల్ విలువ రూ.107 కోట్లుగా ఉంటుందని వెల్లడైంది. అయితే డీల్ ప్రక్రియ పూర్తి కావటానికి 2-3 నెలల సమయం పడుతుందని తెలుస్తోంది.
ప్రస్తుత డీల్ కారణంగా అపోలో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని వెల్లడైంది. కొనుగోలు ఒప్పందం రక్షణ రంగంలో అపోలో గ్రూప్ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఇక డీల్ వివరాల్లోకి వెళితే ఐడీఎల్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 78.65 లక్షల షేర్లను అపోలో గ్రూప్ ఒక్కోటి రూ.135.04 చొప్పున కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. అంటే డీల్ ద్వారా ఐడీఎల్ లో 100 శాతం వాటాలను అపోలో డిఫెన్స్ కొనుగోలు చేస్తోంది. వాస్తవానికి ఐడీఎల్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ హిందూజా గ్రూప్ కంపెనీల్లో ఒక భాగం.
►ALSO READ | Monday Markets: ఈవారం మార్కెట్ల దారెటు..? ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశాలివే..!
ఈ వార్తలు బయటకు రావటంతో ఇన్వెస్టర్ల దృష్టి అపోలో మైక్రో సిస్టమ్స్ షేర్లపై పడింది. అయితే శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో స్టాక్ ధర ఒక్కోటి 0.64 శాతం పెరుగుదలతో రూ.116.40 వద్ద ప్రయాణాన్ని ముగించాయి. గడచిన 5 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే స్టాక్ తన పెట్టుబడిదారులకు ఏకంగా 1500 శాతం మెగా రాబడిని అందించి కనకవర్షం కురిపించాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3వేల 567 కోట్లుగా ఉంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.