
Market Next Week: గడచిన శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది అత్యధిక లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి. రిలయన్స్ లాంటి హెవీ వెయిట్ స్టాక్స్ ర్యాలీ దీనికి దోహదపడింది. త్వరలోనే అమెరికా యూఎస్ మధ్య వ్యాపారానికి వాణిజ్య ఒప్పందం జరగొచ్చనే ఆశాజనకమైన వార్తలతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిరంతరం భారత మార్కెట్లో పెట్టుబడులు మార్కెట్లను ముందుకు నడిపిస్తున్నాయి. దీంతో గతవారం సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు 1 శాతానికిపైగా లాభంతో ప్రయాణాన్ని ముగించాయి. అయితే ఇప్పుడు ఇన్వెస్టర్లు రానున్న వారం మార్కెట్లు ఎలా ఉంటాయనే విషయాలను పరిశీలిస్తున్నారు.
రానున్న వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రధానంగా ప్రభావితం చేసే అంశాల గురించి పరిశీలిస్తే.. ముందుగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ ప్రకటన కోసం మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ సారి పావెల్ కీలక వడ్డీ రేట్లను తగ్గింపును ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది రెండు విడతలుగా 50 బేసిస్ పాయింట్ల వరకు రేట్ల తగ్గింపు ఉండొచ్చని ఫెడ్ ఛైర్ గతంలోనే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ టారిఫ్స్ పాలసీలు నిరుద్యోగిత, ద్రవ్యోల్బణాన్ని పెంచవచ్చనే ఆందోళనలు మాత్రం సెంట్రల్ బ్యాంకును వెంటాడుతున్నాయి.
ఇక మార్కెట్లను ప్రభావితం చేయనున్న మరో అంశం నాల్గవ త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు. మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టి, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, టైటాన్, కొఫోర్జీ, పేటీఎం, డాక్టర్ రెడ్డీస్ వంటి అనేక కంపెనీలు తమ ఫలితాలను రానున్న వారంలో ప్రకటించనుండటంతో ఇన్వెస్టర్లు వీటిపై తమ దృష్టిని కొనసాగిస్తున్నారు. అలాగే గతవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్లలోకి రూ.7వేల 680 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. అయితే ఇదే జోరు రానున్న వారం కూడా కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే.
►ALSO READ | సినిమాలు, టీవీ, ఓటీటీ ద్వారా రూ. 5 లక్షల కోట్ల ఆదాయం
ఇదే క్రమంలో రానున్న వారంలో 2 కొత్త ఐపీవోలతో పాటు 5 ఐపీవోల లిస్టింగ్స్ ఉండటంతో చాలా కాలం తర్వాత ఐపీవో మార్కెట్ తిరిగి పుంజుకుంది. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఏథర్ ఎనర్జీ ఐపీవో రేపు ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో లిస్టింగ్ కానుంది. అలాగే 4 ఎస్ఎమ్ఈ ఐపీవోలు కూడా రానున్న వారంలో తమ అదృష్టా్న్ని పరీక్షించుకోవటానికి వస్తున్నాయి.
భారతీయ స్టాక్ మార్కెట్లను రానున్న వారంలో ప్రభావితం చేసే మరో అంశం ఇండియా పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు. మార్కెట్ నిపుణులు ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల లాభాలను తాత్కాలికమైనవిగా పేర్కొంటూ రోజురోజుకూ ముదురుతున్న భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్వెస్టర్లు ప్రపంచవ్యాప్తంగా భారత మార్కెట్లలో పెట్టుబడి పెట్టడానికి ముందు ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు.