ఎగురుతున్న విమానాన్ని బెదిరించి కిందికి దింపిన్రు

ఎగురుతున్న విమానాన్ని బెదిరించి కిందికి దింపిన్రు


బెలారస్:ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని అడ్డుకుని బెలారస్ అధికారులు ​బలవంతంగా కిందికి దించారు.. పక్క దేశానికి వెళ్లాల్సిన విమానాన్ని తమ రాజధానిలో ల్యాండ్​ చేయించారు. ఇందుకోసం సదరు ఫ్లైట్​లో బాంబు ఉందని భయపెట్టారు.. అప్పటికీ వినరేమోనని ఓ యుద్ధవిమానాన్ని పంపించి బెదిరించారు. ఇదే విషయాన్ని మైక్​లో చెబుతుండగానే ప్రయాణికులలో ఓ యువకుడు భయంతో వణకడం మొదలెట్టిండు. విమానం అక్కడ దిగితే తనను పట్టుకుని ఉరితీస్తారని ఆందోళన వ్యక్తం చేసిండు. అయినా చేసేదేంలేక పైలట్​ విమానాన్ని దారిమళ్లించి, బెలారస్​ కేపిటల్​ మిన్స్క్ లో దింపాడు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఓ యువ జర్నలిస్టును అరెస్టు చేసేందుకు బెలారస్​ అధికారులు ఆడిన డ్రామా ఇదంతా.. ప్రెసిడెంట్​ లుకాషెంకో ఆదేశాల మేరకు ఆ జర్నలిస్టును పట్టుకోవడానికి ఏకంగా విమానాన్ని కిందికి దించారు. ఆ జర్నలిస్టును, అతడి గర్ల్​ఫ్రెండ్​ను అదుపులోకి తీసుకుని, ఫ్లైట్​ను పంపించేశారు. అయితే, బెలారస్​ అధికారుల తీరును యురోపియన్​ యూనియన్ తో పాటు చాలా దేశాలు తప్పుబడుతున్నాయి. బెలారస్​ గగనతలం నుంచి ప్రయాణించొద్దని తమ ఎయిర్​లైన్స్​కు ఆదేశాలివ్వడంతో పాటు ఆ దేశానికి వెళ్లొద్దని తమ సిటిజన్లకు సూచనలు జారీ చేశాయి. అంతర్జాతీయ సమాజం నుంచి ఇప్పటికే పలు ఆంక్షలు ఎదుర్కొంటున్న బెలారస్..  తాజా చర్యతో ఇంకొన్ని ఆంక్షలకు సిద్ధపడాల్సిందే!

ఎన్నికల రిజల్ట్ పై వివాదం

రష్యా, పోలండ్, ఉక్రెయిన్​ల మధ్య ఉన్న చిన్న దేశమే బెలారస్.. ప్రెసిడెంట్​ అలెగ్జాండర్​ లుకాషెంకో  దేశాన్ని 27 ఏళ్లుగా పాలిస్తున్నారు. 1994లో అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత విమర్శకులను అణిచివేస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికలు, ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగినా.. లుకాషెంకో తనే విజేతనని ప్రకటించుకున్నాడు. మళ్లీ పాలనా బాధ్యతలు చేపట్టాడు. పాలనతో పాటు ఎన్నికలకు ముందు తనకు వ్యతిరేకంగా పనిచేసిన పొలిటీషియన్లు, జర్నలిస్టులపైన కక్ష సాధింపు చర్యలు చేపట్టిండు. ఈయూ దేశాలలో మరణశిక్షలు ఇంకా అమలులో ఉన్న దేశం బెలారస్​ ఒక్కటే.. ఈ నేపథ్యంలో లుకాషెంకో  వేధింపులు తట్టుకోలేక, ప్రాణభయంతో చాలామంది దేశం విడిచి పారిపోయారు. పక్కనే ఉన్న లిథుయేనియాలో తలదాచుకుంటున్నారు. ఇలా పారిపోయిన వాళ్లలో రోమన్​ ప్రొటాసెవిచ్​ అనే యువ జర్నలిస్టు ఒకరు. 2019 వరకు ప్రొటాసెవిచ్​ నెక్స్టా అనే టెలిగ్రామ్​ చానెల్​కు ఎడిటర్​గా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలను నెక్స్టా నిర్భయంగా ప్రసారం చేసేది. దీంతో ప్రెసిడెంట్​లుకాషెంకో ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. 2019లో అణిచివేత తీవ్రం కావడంతో ప్రొటాసెవిచ్ లిథుయేనియాకు పారిపోయారు. అక్కడే మరొక టెలిగ్రామ్​ చానల్​కు ఎడిటర్​గా వ్యవహరిస్తున్నారు. అయితే, బెలారస్​ నిఘా అధికారులు ఆయనను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. 

ఇప్పుడు ఏంజరిగింది...

ఏథెన్స్​లో జరిగిన ఎకనామిక్​ కాన్ఫరెన్స్​కు హాజరైన ప్రొటాసెవిచ్ ర్యాన్​ఎయిర్​ ఫ్లైట్​లో తిరిగి లిథుయేనియా బయల్దేరారు. ఆయన తో పాటే కొంతమంది నిఘా అధికారులు ఎక్కారు. తమ ప్రెసిడెంట్​ లుకాషెంకోకు ఈ కబురు అందించారు. గ్రీస్ నుంచి లిథుయేని యా వెళ్లాలంటే ఫ్లైట్​ బెలారస్​ గగనతలం నుంచే ప్రయాణించాలి. దీంతో ర్యాన్​ ఎయిర్​ విమానం తమ పరిధిలోకి రాగానే పైలట్​ను బెదిరించి కిందికి దించారు. ప్రొటాసెవిచ్, ఆయన గర్ల్​ఫ్రెండ్​ను అరెస్టు చేసి విమానాన్ని వదిలిపెట్టారు. ఈయూ దేశాలు దీనిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. జర్నలిస్టును, ఆయన గర్ల్​ఫ్రెండ్​ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశాయి.