
బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు, హీరో సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ ‘స్వాతిముత్యం’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. దసరాకి ఈ సినిమా రిలీజవుతోంది. ఈలోపే మరో మూవీ అనౌన్స్‌మెంట్‌తో సర్‌ప్రైజ్ చేశాడు గణేష్. అతని రెండో మూవీ ‘నేను స్టూడెంట్ సర్’ అనే వెరైటీ టైటిల్‌తో రూపొందుతున్న విషయాన్ని నిన్న రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు.
గణేష్‌ని పోలీసులు చుట్టుముట్టారు. తుపాకులు ఎక్కుపెట్టారు. ‘నేను స్టూడెంట్‌ని సర్’ అంటూ చేతిలోని ఐడీని చూపిస్తున్నాడు గణేష్. అప్పటికే అతని ఒంటిమీద దెబ్బలున్నాయి. అసలేం జరిగింది, గణేష్ వెంట పోలీసులు ఎందుకు పడుతున్నారనేది ఆసక్తిని కలిగిస్తోంది. తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ‘నాంది’ఫేమ్ సతీష్ నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య కథ అందిస్తే, కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాస్తున్నాడు. సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్ దీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. అతి త్వరలో రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయనున్నారు.