ఆర్టీసీలో చనిపోయిన వాళ్లకు బెనిఫిట్స్‌ ఇస్తలే..

ఆర్టీసీలో చనిపోయిన వాళ్లకు బెనిఫిట్స్‌ ఇస్తలే..

హైదరాబాద్‌‌, వెలుగు : ఆర్టీసీలో ఇప్పటి దాకా పనిచేస్తున్న ఉద్యోగులకే కాదు.. చనిపోయినవాళ్లకు కూడా బెనిఫిట్స్‌‌ ఇస్తలేరు. సర్వీసుల్లో ఉండి చనిపోయిన ఉద్యోగులకుటుంబాలకు ఏడాదిన్నరగా పీఎఫ్‌‌ బీమా డబ్బులు అందడం లేదు. ఎంప్లాయీస్‌‌ నుంచి రికవరీ చేసిన డబ్బులన్నీ ఆర్టీసీ సొంతానికి వాడేసుకుని.. ఇప్పుడు డబ్బుల్లేవని చేతులెత్తేసింది. ఒక్క కరోనా టైంలోనే 410 మంది ఆర్టీసీ ఉద్యోగులు మృత్యువాత పడ్డారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన ఆయా కుటుంబాలు బెనిఫిట్స్ కూడా అందక అవస్థలు పడుతున్నాయి. 

రూ.7 లక్షల దాకా బెనిఫిట్‌‌..

ఆర్టీసీలో 49 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ పీఎఫ్‌‌ అకౌంట్ఉంది. ఈ ఖాతా ఉన్న ప్రతి ఎంప్లాయ్‌‌కు ఎంప్లాయీస్‌‌ డిపాజిట్‌‌ లింక్డ్‌‌ ఇన్సురెన్స్‌‌ స్కీం(ఇడ్లిస్‌‌) వర్తిస్తుంది. ఉద్యోగి సర్వీసులో ఉండి చనిపోతే డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన నెల రోజుల్లోపు నామినీకి డబ్బులు అందజేయాలి. ఇంతవరకు మ్యాగ్జిమమ్ రూ.6 లక్షల వరకు పరిహారం వస్తుండగా.. అది ఇప్పుడు రూ.7 లక్షలకు పెరిగింది. మినిమమ్‌‌ రూ. 2.5 లక్షలు చేశారు. ఈ నిబంధనలు 2019 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఇతర డిపార్ట్‌‌మెంట్ల లెక్క కాకుండా పీఎఫ్‌‌ డబ్బులన్నీ ఆర్టీసీ వద్దనే ఉంటాయి. ఆర్టీసీ సపరేట్‌‌ ట్రస్ట్‌‌గా ఉంది. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడే మేనేజ్‌‌మెంట్‌‌ సొంతంగా నడుపుకోవడానికి ఈపీఎఫ్‌‌వో నుంచి ఆర్టీసీ పర్మిషన్‌‌ తీసుకుంది. ఎంప్లాయీస్‌‌ నుంచి రికవరీ చేసిన మొత్తం డబ్బులను పీఎఫ్‌‌ ఆఫీసుకు పంపించరు. ఎంప్లాయ్‌‌ పెన్షన్‌‌ స్కీం డబ్బులు రూ. 1,200 మాత్రమే పీఎఫ్‌‌కు జమ చేస్తారు. మిగతావన్నీ ఆర్టీసీ వద్దనే ఉంటాయి. అయితే వివిధ కారణాలతో మొత్తం రూ.1,288 కోట్లను ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. దీంతో ఉద్యోగులు చనిపోతే వారికి బీమా పరిహారం ఇవ్వడానికి అణాపైసా లేదు. ఈపీఎఫ్‌‌ చట్టం ప్రకారం ఎంప్లాయీస్‌‌ డిపాజిట్‌‌ లింక్డ్‌‌ ఇన్సురెన్స్‌‌ స్కీం(ఇడ్లిస్‌‌) డబ్బులను ఉన్నప్పుడు ఇస్తామంటే కుదరదు. నెల రోజుల్లోపు కచ్చితంగా ఇవ్వాలి. కానీ ఆర్టీసీ మాత్రం పట్టించుకోవడం లేదు.

600 కుటుంబాల ఎదురుచూపులు

గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి దాకా కరోనా ఇతర సమస్యలతో 410 మంది ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయారు. కరోనాతో చనిపోతే ఎంప్లాయీస్ కు  ప్రభుత్వం, ఆర్టీసీ నుంచి ఎలాంటి పరిహారం ప్రకటించలేదు. ఫ్రంట్‌లైన్‌ వారియర్‌ అని కూడా గుర్తించలేదు. కనీసం బీమా కూడా ఇస్తలేరు. వీటి కోసం రూ. 25 కోట్ల వరకు అవసరం పడుతాయని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు.. కనీసం బీమా డబ్బులైనా వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నాయి.