ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన ఘోరమైన అత్యాచార ఘటన తర్వాత 'సిటీ ఆఫ్ జాయ్' ప్రస్తుతం అనేక నిరసనలకు సాక్షిగా నిలుస్తోంది.
తాజాగా కోల్‌కతా నగరంలో శుక్రవారం (ఆగస్ట్ 23న) సాయంత్రం బెంగాలీ నటి పాయెల్ ముఖర్జీ (Payel Mukherjee) కారు నడుపుతుండగా ఓ బైకర్ దాడి చేశాడు. ఈ మేరకు నటి పాయెల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ సంఘటన గురించి వివరిస్తూ లైవ్ వీడియోను పంచుకున్నారు.
"సౌత్ కోల్‌కతాలోని సదరన్ ఎవెన్యూ సమీపంలో ఆమె డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. బైకర్ మొదట అద్దాన్ని పగలగొట్టాడు. దీంతో పాయెల్ తీవ్రంగా గాయపడింది. ఆ భయంకరమైన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ఏడుస్తూ వీడియో చేసింది. ఒక మహిళపై నడిరోడ్డులో అది కూడా బాగా రద్దీగా ఉన్న ప్రాంతంలో కారును ఆపి దాడి చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని నటి పాయెల్ ముఖర్జీ వీడియోలో చెప్పారు.
ఆమె మాటల్లో..''నా భద్రతకు భయపడి నేను బయటకు రావడానికి నిరాకరించడంతో..ఆ వ్యక్తి నా కుడి వైపు కిటికీ అద్దాన్ని కొట్టి, దానిని ముక్కలుగా చేసి, నా చేతికి గాయం చేశాడు. ఇప్పుడు మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో అర్ధం అవట్లేదు. సాయంత్రం వేళ రద్దీగా ఉండే వీధిలో ఒక స్త్రీపై..ఈ విధంగా దాడి జరిగితే..ప్రస్తుత వాస్తవ పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు తెలియజేస్తుంది. మహిళల భద్రత సమస్యపై కోల్‌కతా నగరం అంతటా ఓ వైపు ర్యాలీలు చేస్తుండగా..మరోవైపు ఈ దాడి జరిగింది" అని పాయెల్ తన వీడియోలో వెల్లడించింది. అదే జన సంచారం లేని ప్రాంతంలో ఈ దాడి జరిగి ఉంటే తను ప్రాణాలతో ఉండేదాన్ని కాదని తెలిపింది.
Also Read :- నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేతకు కారణాలివే..
పాయెల్ ముఖర్జీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పాయెల్ కారు తన బైకును రాసుకుంటూ వెళ్లడంతోనే దాడి చేసినట్లు యువకుడు చెప్పాడు. యువకుడు చెప్పినదాంట్లో నిజం లేదని పాయెల్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే దాడి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. బెంగాల్ బీజేపీ పాయెల్ ముఖర్జీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ సీఎం మమత సర్కార్ పై నిప్పులు చెరిగింది. మహిళలకు కోల్‌కతా నగరం అంటేనే భయపడేలా మమత సర్కార్ వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగింది. దీనితో పాటు, దాడి చేసిన ఆ వ్యక్తి బైక్ వివరాలను కూడా నటి పంచుకుంది.