ఫేక్ యాక్సిడెంట్ స్కామ్.. డ్రైవర్లను టార్గెట్ చేస్తోన్న దోపిడీగాళ్లు

ఫేక్ యాక్సిడెంట్ స్కామ్.. డ్రైవర్లను టార్గెట్ చేస్తోన్న దోపిడీగాళ్లు

బెంగళూరులో డ్రైవర్లను టార్గెట్ చేసిన దుండగుల ఘటనలు ఒకే వారంలో రెండు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. వాహనంలో ఉన్నవారిని దోచుకునే ప్రయత్నంలో తన కారును సిమెంట్ దిమ్మెతో ఢీకొట్టినట్లు బెంగళూరు వ్యక్తి షేర్ చేసిన ఒక రోజు తర్వాత, మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Xలో 'ఫేక్ యాక్సిడెంట్' స్కామ్ మరొక ఉదాహరణను చూపించే పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

బెంగళూరు నివాసి సృజన్ ఆర్ శెట్టి ఈ విషయంపై మాట్లాడుతూ.. తన భార్య నలుగురు సహోద్యోగులతో కలిసి సర్జాపూర్ ప్రాంతంలో డ్రైవింగ్ చేస్తుండగా, కొంతమంది వ్యక్తులు ఆమె కారును వెంబడించడం ప్రారంభించారు. "సర్జాపూర్‌లో ఫేక్ యాక్సిడెంట్స్ లో భాగంగా కొన్ని భయంకరమైన వీడియోలను నేను చూశాను, అక్కడ పోకిరీలు కారులో ఉన్న వ్యక్తులను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించారు" అని శెట్టి రాశారు. తన భార్య ప్రయాణిస్తున్న కారును కొందరు వ్యక్తులు కొన్ని కిలోమీటర్ల మేర వెంబడించి, ఆమె ప్రధాన రహదారిపై ఆగిపోయారని శెట్టి చెప్పారు. ఈ వెంబడించే సమయంలోనే తమ వాహనాలు పాడైపోయాయని ఆరోపిస్తూ, ఆ వ్యక్తులు కారును చుట్టుముట్టి, ఆమెను బయటకు రావాలని డిమాండ్ చేశారు.

పక్కనే ఉన్నవారు ఎవరూ తన భార్యకు, ఆమె ముగ్గురు సహోద్యోగులకు సహాయం చేయలేదని శెట్టి చెప్పారు. వారి బృందంలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారన్నారన్నారు. చివరికి, శెట్టి భార్య తెలివిగా ఆలోచన చేయడంతో వారు తప్పించుకోగలిగారు. ఆమె కారును ఒక ప్రధాన రహదారిపై ఆపి, పోలీసులకు సమాచారం అందించడమే కాకుండా, ఆమె తన చాలా మంది స్నేహితులను కూడా పిలిచింది. "పోలీసులకు కాల్ చేసి, మమ్మల్ని, ఆమె స్నేహితుల్లో 10 మందిని వెంటనే ఆమె లొకేషన్‌లో చేరమని చెప్పింది. ఆమె అలా తెలివితో ఆ పని చేసి ఉండకపోతే, ఈ సంఘటన వేరే మలుపు తిరిగి ఉండేది" అని శెట్టి చెప్పారు. సర్జాపూర్ ఇలాంటి ఘటనలకు హాట్‌స్పాట్‌గా మారిందని, మెరుగైన భద్రత అవసరమని ఆయన తన పోస్ట్‌ను ముగించారు.

ఫేక్ యాక్సిడెంట్ స్కామ్ అనేది కొత్తదేం కాదు. ఏదో ఒక విధంగా వాహనాన్ని ఢీకొట్టడం, అందులో ఉన్నవారిని బలవంతంగా బయటకు తీయడం, దోచుకోవడం లేదా డబ్బు కోసం దోపిడీ చేయడం ఈ స్కామ్ ప్రాథమిక సూత్రం. ఈ వారం ప్రారంభంలో, బెంగళూరు వ్యక్తి నైస్ రోడ్‌లో తెల్లవారుజామున 2.30 గంటలకు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో తనకు ఎదురైన భయానక అనుభవాన్ని వివరించాడు. కారును సిమెంటు దిమ్మెతో ఢీకొట్టడంతో విండ్ షీల్డ్ దెబ్బతింది. "మేము కారును ఆపలేదు ఎందుకంటే అలాంటి సందర్భాలలో వాహనంలో ఉన్నవారు ఏమి జరిగిందో పరిశీలించడానికి వెళ్తే.. ఆ సమయంలో వారిని దోచుకోవడం చేస్తుంటారు" అని ఆ వ్యక్తి చెప్పాడు.