దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఊహించని పరిణామం జరిగింది. స్వయంగా ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ సదస్సులో ప్రపంచ స్థాయి దిగ్గజాలైన సుందర్ పిచాయ్, బిల్ గేట్స్, సామ్ ఆల్ట్‌మాన్ వంటి వారు పాల్గొంటున్నారు. ఇంతటి భారీ భద్రత ఉన్న ప్రాంతంలో అదీ అత్యున్నత స్థాయి భద్రతా బలగాల పర్యవేక్షణలో ఉన్న ఒక స్టాల్ నుంచి AI Wearable పరికరాలు దొంగతనానికి గురికావడం సంచలనం సృష్టిస్తోంది.
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'నియోసాపియన్' సీఈఓ ధనంజయ్ యాదవ్ ఈ చేదు అనుభవాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఫిబ్రవరి 16న సదస్సు మొదటి రోజున మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని మోదీ సందర్శన ఉండటంతో.. భద్రతా కారణాల దృష్ట్యా మధ్యాహ్నం 12 గంటలకే ఎగ్జిబిషన్ ఏరియాను ఖాళీ చేయాలని సెక్యూరిటీ సిబ్బంది ఆదేశించారు. ఆ సమయంలో తన కంపెనీ రూపొందించిన.. మాటలను ట్రాక్ చేస్తూ భావోద్వేగాలను విశ్లేషించే అత్యాధునిక ఏఐ వేరబుల్ పరికరాలను అక్కడే వదిలి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ALSO READ : సంపాదన పెరుగుతున్నా పేదరికం ఎందుకు వీడటం లేదు?
Day 1 of the AI Impact Summit turned to be a pain for us.
— Dhananjay Yadav (@imDhananjay) February 16, 2026
I came genuinely excited, it was the first time the summit was being hosted in India, and I wanted to show up personally to support the ecosystem and the government’s push.
But what happened next was shocking.
At 12… pic.twitter.com/9gVygparq0
సెక్యూరిటీ మాట నమ్మి వెళ్తే..
నిజానికి తన పరికరాలను వెంట తీసుకెళ్తానని ధనంజయ్ భద్రతా సిబ్బందిని కోరారు. అయితే ఇతర కంపెనీల వారు ల్యాప్‌టాప్‌లను కూడా స్టాల్స్‌లోనే వదిలి వెళ్తున్నారని.. ఇక్కడ భద్రతకు ఏ డోకా ఉండదని అధికారులు భరోసా ఇచ్చారు. వారి మాటలు నమ్మి తన ఉత్పత్తి ప్రధాని దృష్టిలో పడుతుందేమోననే ఆశతో బయటకు వచ్చారు. కానీ సీన్ కట్ చేస్తే దాదాపు 6 గంటల తర్వాత తిరిగి స్టాల్‌కు వచ్చి చూడగా పరికరాలు ఉన్న పెట్టెలు ఖాళీగా పడి ఉన్నాయని వెల్లడించారు కంపెనీ వ్యవస్థాపకుడు.
హై-సెక్యూరిటీ జోన్ కావడంతో ఆ సమయంలో కేవలం భద్రతా సిబ్బంది.. అధికారిక బృందాలకు మాత్రమే అక్కడికి వెళ్లే అనుమతి ఉంది. మరి అంతటి కట్టుదిట్టమైన భద్రత మధ్య దొంగతనం ఎలా జరిగిందని ధనంజయ్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. విమాన ప్రయాణాలు, వసతి, స్టాల్ కోసం భారీగా ఖర్చు చేసి వస్తే.. చివరకు తమ ప్రొడక్ట్స్ దొంగిలించబడటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏఐ పుష్‌కు మద్దతుగా రావాలనుకున్న తన ఉత్సాహంపై ఈ ఘటన నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. దేశంలో ప్రతిష్టాత్మక సదస్సుల నిర్వహణలో భద్రతా సమన్వయంపై చర్చకు దారితీసింది.
