
Bengaluru News: పేరుకే ఇండియన్ సిలికాన్ వ్యాలీ. కానీ ప్రజల అవసరాలకు అనువైన రోడ్లు, డ్రైనేజీలు, రవాణా వ్యవస్థలు మాత్రం దారుణంగా ఉంటాయి బెంగళూరు నగరంలో. ఐటీ పరిశ్రమకు పెట్టింది పేరైన ఈ నగరంలో ఉన్న అద్వానమైన పరిస్థితుల గురించి మరోసారి వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే బెంగళూరు నగరంలో నివసించే డాక్టర్ కిరణ్ అనే వ్యక్తి భృహత్ బెంగళూరు మహానగర పాలికే తనకు ఏకంగా రూ.50 లక్షలు చెల్లించాలంటూ లీగల్ నోటీసులు పంపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వేళితే నగరంలోని రోడ్లు దారుణంగా ఉండటం కారణంగా వాటిపై ప్రయాణించటంతో తనకు మెడ, నడుము నొప్పి వచ్చిందని సదరు వ్యక్తి నోటీసుల్లో పేర్కొన్నాడు. పైగా ఈ క్రమంలో తాను ఐదుగురు నిపుణులను కలవాల్సి వచ్చిందని వారి పరీక్షల్లో రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వచ్చిన కుదుపులు కారణంగా ఈ ఇబ్బంది ఏర్పడినట్లు డయాగ్నైజ్ చేసినట్లు అందులో వెల్లడించాడు.
ఈ క్రమంలో తన ఆరోగ్య చికిత్సలకు అయిన ఖర్చులు, తనకు కలిగిన బాధ, ఇబ్బందికి బీబీఎంపీ రూ.50 లక్షలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఉన్న రోడ్లపై ఆటో లేదా టూవీలర్లలో ప్రయాణించటం అస్సలు సేఫ్ కాదని, అలాగే వాటిపై ప్రయాణం తన ఆరోగ్యాన్ని మరింతగా క్షీణింపజేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితులు తన ప్రయాణానికి, స్వేచ్ఛకు అవరోధంగా మారాయని పేర్కొన్నాడు. ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న పౌరుడిగా మెరుగైన రవాణాకు రోడ్లు ఉండేలా డిమాండ్ చేయటం తన హక్కుగా సదరు వ్యక్తి ప్రభుత్వ సంస్థకు అందించిన లీగల్ నోటీసుల్లో స్పష్టం చేశాడు.
తన నోటీసులపై 15 రోజుల్లోగా బీబీఎంపీ స్పందించకపోతే తాను దీనిపై కర్ణాటక హైకోర్టు, మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానన్నారు. అలాగే దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేస్తానని వెల్లడించారు. తనకు జరిగిన నష్టంపై సివిల్ కేసు పెట్టి న్యాయం కోసం పోరడతానని వెల్లడించాడు. అలాగే నోటీలకు రూ.10వేలు ఛార్జీలుగా చెల్లించాలని అందులో పేర్కొనబడింది. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోనే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా అనే విషయం తాజా పరిణామాలతో బయటకు వచ్చింది. చిన్న వర్షం పడినా గానీ నగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగే స్థాయిలో ఉండటం బీబీఎంపీ పనితీరుపై ఆందోళనలు రేకెత్తిస్తోంది.