తన 11 నెలల కొడుకు ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి చనిపోవడంతో, ఆ బాధను తట్టుకోలేక ఓ తల్లి ప్రాణాలు తీసుకున్న విషాద ఘటన బెంగళూరులో జరిగింది. వివరాల ప్రకారం.. బైరవేశ్వరనగర్‌కు చెందిన ప్రతిభ (29) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమె భర్త మహంతేష్ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. బుధవారం సాయంత్రం ప్రతిభ తన కొడుకు అగస్త్యను గదిలో ఉంచి, ఆరబెట్టిన బట్టలు తీసుకురావడానికి ఇంటి పైన ఉన్న టెర్రస్‌పైకి వెళ్ళింది. ఆ కొద్దిసేపట్లోనే చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి, నీళ్ల బకెట్‌లో బోర్లా పడిపోయాడు. దింతో ఊపిరి ఆడక ఆ పసికందు ప్రాణాలు కోల్పోయాడు.
తల్లి ఆత్మహత్య
టెర్రస్ పై నుంచి వచ్చిన ప్రతిభకు కొడుకు విగతజీవిగా కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తన నిర్లక్ష్యం వల్లే కొడుకు చనిపోయాడని విపరీతంగా కుంగిపోయింది. ఆ బాధతోనే ఒక సూసైడ్ నోట్ రాసి, మొదట మాత్రలు మింగి, చేతి మణికట్టు కోసుకుంది. అవి విఫలం కావడంతో చివరికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భర్త ఇంటికి వచ్చేసరికి
సాయంత్రం ఆరున్నర గంటలకు భర్త మహంతేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టినా తీయలేదు. ఫోన్ చేసినా సమాధానం లేదు. అనుమానం వచ్చి కిటికీ నుండి చేయిపెట్టి తాళం తీసి లోపలికి వెళ్లి చూడగా.. భార్య ఉరివేసుకుని ఉంది, మంచం మీద కొడుకు విగతజీవిగా పడి ఉన్నాడు.
ఆమె రాసిన లేఖలో నా కొడుకు మరణానికి నేనే కారణం, ఈ పాపంతో నేను బతకలేను అని రాసి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
