- రెండో స్థానంలో సంగారెడ్డి, రంగారెడ్డి ఆస్పత్రులు
- కాయకల్ప అవార్డులు ప్రకటించిన సర్కారు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న దవాఖానగా కామారెడ్డి జిల్లా హాస్పిటల్ ఎంపికైంది. పరిసరాల పరిశుభ్రత మొదలుకుని, ట్రీట్ మెంట్ వరకూ ఉత్తమ సేవలు అందిస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గానూ 89.80 శాతం మార్కులతో రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచి కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. 82.80 శాతం మార్కులతో సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా హాస్పిటల్స్ రెండో స్థానంలో నిలవగా, ఖమ్మం, జనగామ, సిరిసిల్ల జిల్లా హాస్పిటల్స్ ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. ఏరియా ఆస్పత్రుల(ఏహెచ్) విభాగంలో 92.8 శాతం మార్కులతో భద్రాచలం ఏహెచ్ తొలి స్థానంలో నిలిచింది.
బాన్సువాడ, జహీరాబాద్ ఏహెచ్‌లు తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ) విభాగంలో పాల్వంచ, వికారాబాద్, అసిఫాబాద్ సీహెచ్‌సీలు వరుసగా ఒకటి, రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్ల (పీహెచ్‌సీ) విభాగంలో కామారెడ్డి జిల్లా బికనూర్ పీహెచ్‌సీ 96% మార్కులతో టాప్‌లో నిలిచింది. 95.8 శాతంతో మహబూబ్‌నగర్‌లోని జనాంపేట్ పీహెచ్‌సీ రెండో స్థానంలో, 92.2 %తో జగిత్యాలలోని ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీ మూడో స్థానంలోనూ ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆస్పత్రుల ప్రతినిధులకు ప్రభుత్వం అవార్డులు అందజేయనుంది.
