- భూముల వేలానికి మే నెలలోనే ఐదు నోటిఫికేషన్లు
- హెచ్ఎండీఏ పరిధిలో ల్యాండ్ పూలింగ్ వేగవంతం
- మరిన్ని ఏరియాల్లో వెంచర్లు వేసేందుకు ఏర్పాట్లు
- రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 1,500 ఎకరాల సమీకరణకు సన్నాహాలు
హైదరాబాద్, వెలుగు: ఖాళీ అయిన ఖజానాను నింపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరుస పెట్టి భూములను అర్రాస్ వేస్తోంది. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను మించి బిజినెస్ చేస్తోంది. ఒక్క మే నెలలోనే హెచ్ఎండీఏ డెవలప్ చేసిన వెంచర్లు, రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి ఐదు నోటిఫికేషన్లు విడుదల చేసింది. సోమవారం తుర్కయంజాల్‌లో 9.5 ఎకరాల్లో 34 ప్లాట్లకు.. మంగళవారం మేడ్చల్ జిల్లా బహదూర్‌పల్లి, రంగారెడ్డి జిల్లా తొర్రూర్‌లోని 199 ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇలా రెండు రోజుల్లో హెచ్ఎండీఏ రెండు నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం గమనార్హం. మరోవైపు ఇంకొన్ని ప్రాంతాల్లో వెంచర్ల ఏర్పాటుకు ల్యాండ్ పూలింగ్‌ను వేగవంతం చేసింది.
డిమాండ్ ఉండటంతో అమ్ముడే అమ్ముడు
ప్లాట్ల వేలానికి ఊహించిన దానికంటే ఎక్కువగా స్పందన, ధర రావడంతో ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా మే 12న హైదరాబాద్ బండ్లగూడలోని 1,082 రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు, పోచారంలోని 1,328 ఫ్లాట్ల వేలానికి నోటిఫికేషన్ ఇచ్చింది. మరుసటి రోజే మే 13న రంగారెడ్డి జిల్లా చందానగర్‌లోని ఆరంభ్ టౌన్‌షిప్‌లో 3 ప్లాట్లు, అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని కవాడిపల్లిలో 117 ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అదే నెల 20న నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 838 ఓపెన్ ప్లాట్లు, 363 ఇండ్లు వేలం వేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. పది రోజులు తిరగకముందే హైదరాబాద్– నాగార్జున సాగర్ హైవేలోని ఓఆర్ఆర్‌కు సమీపంలో తుర్కయంజాల్ పరిధిలో 9.5 ఎకరాల్లో ఉన్న 34 ప్రైమ్ ప్లాట్స్ వేలానికి మే 29న షెడ్యూల్ రిలీజ్ చేసి, 31 నుంచి రిజిస్ట్రేషన్‌కు అవకాశమిచ్చింది. ఇక్కడ గజం ధర రూ.40 వేలుగా నిర్ణయించింది.
తాజాగా బహదూర్‌పల్లిలో 51.. తొర్రూర్‌లో 148 ప్లాట్లకు నోటిఫికేషన్
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మేడ్చల్ జిల్లా బహదూర్‌పల్లి, రంగారెడ్డి జిల్లా తొర్రూర్‌లోని లేఅవుట్లలోని ప్లాట్ల వేలానికి బుధవారం హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బహదూర్ పల్లిలో 51 ప్లాట్లు, తొర్రూర్‌లో 148 ప్లాట్లను అర్రాస్ వేయనున్నట్లు పేర్కొంది. గతంలో అమ్ముడుపోని ప్లాట్లతోపాటు మరికొన్నింటికి ఈసారి వేలం నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. వేలంలో పాల్గొనాలనుకునే వారు జూన్ 28న సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) కింద రూ.3 లక్షలు చేయాలని, ఇందుకు జూన్ 29 వరకు గడువు ఉందని పేర్కొంది. ప్లాట్లకు సంబంధించిన ఆన్‌లైన్ వేలం జూన్ 30న ఉంటుందని తెలిపింది. బహదూర్‌పల్లిలోని ప్లాట్లకు ఒక్కో గజానికి రూ.25వేలు, తొర్రూర్‌లో గజానికి రూ.20 వేల కనీస ధరను నిర్ధారించింది.
భారీ వెంచర్లకు రెడీ
ఇప్పటికే సిద్ధం చేసిన ప్రపోజ్డ్ లే అవుట్లలో ప్లాట్ల వేలం చేపట్టిన హెచ్ఎండీఏ.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెంట మరిన్ని వెంచర్ల ఏర్పాటుకు ల్యాండ్ పూలింగ్‌ను వేగవంతం చేసింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఏకంగా 1,500 ఎకరాల భూమిని సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. డెవలప్ చేసిన భూమి విషయంలో యజమానులకు 60 శాతం ఇచ్చేలా, హెచ్ఎండీఏ 40 శాతం వాటా తీసుకునేలా ఇప్పటికే రూల్స్ మార్చింది. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ప్రతాప్ సింగారం గ్రామంలో భారీ వెంచర్‌కు రంగం సిద్ధం చేసింది. 130 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడంతో ప్లాటింగ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలంలోని ఇన్మూల్‌నర్వా, కందుకూరు మండలం లేమూరులో సుమారు 150 ఎకరాల్లో అధికారులు లేఅవుట్లు సిద్ధం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలోని బోగారం, శామీర్ పేట్ వంటి ప్రాంతాల్లో ఓఆర్ఆర్‌కు దగ్గరగా ఉండే భూములను సమీకరిస్తున్నారు.
జూన్‌లో రూ.1,500 కోట్ల టార్గెట్
గతంలో కోకాపేట, ఖానామెట్, ఉప్పల్ భగాయత్‌లో ప్లాట్ల వేలంతో రూ.3,404 కోట్లు రాగా.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, గద్వాల, నల్గొండ, కామారెడ్డి, పెద్దపల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 1,402 రెసిడెన్షియల్, 6 కమర్షియల్ కాంప్లెక్స్ ప్లాట్ల వేలం ద్వారా రూ.567.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఇట్ల మొత్తం రూ.3,971 కోట్ల ఆమ్దానీ సమకూరింది. అలాగే బండ్లగూడ, పోచారంలోని 2,971 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకం ద్వారా 800 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా. నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఓపెన్ ప్లాట్లు, ఇండ్ల వేలం ద్వారా రూ.వెయ్యి కోట్లు, తుర్కయంజాల్‌లోని ప్లాట్ల వేలం ద్వారా కనీసం రూ.200 కోట్ల నుంచి 250 కోట్లు, బహదూర్‌పల్లి, తొర్రూర్‌లోని ప్లాట్ల వేలం ద్వారా మరో రూ.300 కోట్లు, ఆరంభ్ టౌన్‌షిప్ ద్వారా రూ.150 కోట్ల ఇన్‌కమ్ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్‌లో వేలం, ఫ్లాట్ల అమ్మకం ద్వారా 1,500 కోట్లు రాబట్టాలని సర్కార్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
