
మీరు క్యాలరీలు తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారా.. సాయంత్రం వేళ ఆకలిగా అనిపిస్తుందా.. ? నూనెలో వేయించిన చిప్స్ లేదా స్వీట్లకి బదులు మన సంప్రదాయ వంటల్లో ఆరోగ్యకరమైన స్నాక్స్ చాలా ఉన్నాయి. వాటిని సరైన మోతాదులో తీసుకోవడం ద్వారా బరువు పెరుగుతామనే భయం లేకుండా ఇష్టంగా ఆస్వాదించవచ్చు. అయితే ఆరోగ్య నిపుణులు చెబుబుతున్నట్లుగా తక్కువ క్యాలరీలతో పాటు ఫైబర్, ప్రోటీన్ ఉండే స్నాక్స్ తీసుకోవాలి. సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి భయము, ఆలోచన లేకుండా మనం తినగలిగే కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇదిగో... వీటిలో క్యాలరీలు 200 కంటే తక్కువే ఉంటాయి.
వేయించిన శెనగలు: ఒక కప్ వేయించిన శెనగలు తింటే మంచి ప్రోటీన్, ఫైబర్ లభిస్తాయి. ఇవి దాదాపు 120-150 క్యాలరీలను ఇస్తాయి. వీటిలో ఉల్లిపాయలు, టమోటాలు, నిమ్మరసం కలిపి చాట్ లాగా తినొచ్చు.
మొలకల చాట్: మొలకెత్తిన పేసర్లు, కిర దోసకాయ, టమాటా, కొత్తిమీర, నిమ్మరసం కలిపి చేసుకునే చాట్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది, పైగా వీటిలో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు ఈ చాట్లో 150 క్యాలరీల కంటే తక్కువ ఉంటుంది.
మఖానా (lotus seeds): ఉప్పు(rock salt), మిరియాలు, నెయ్యిలో వేయించుకున్న మఖానాలు సాయంత్రం తినడానికి చాలా బాగుంటాయి. ఒక కప్పులో దాదాపు 100 క్యాలరీలు, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది.
చట్నీతో ఇడ్లీ: రెండు చిన్న ఇడ్లీలు పుదీనా చట్నీతో కలిపి తింటే దాదాపు 180 క్యాలరీలు వస్తాయి. ఉడికించిన ఈ ఆహారం తక్కువ నూనెతో చేసుకునే బెస్ట్ ఫుడ్.
ధోక్లా: ఉడికించిన ధోక్లా (సుమారు 3 ముక్కలు) 150–160 క్యాలరీలతో వస్తుంది. పులియబెట్టిన పిండితో తయారు చేయడం వల్ల జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. ధోక్లా అనేది నానబెట్టిన అన్నం, చెనగ పిండితో ఉడికించి చేసేది.
ఫ్రూట్ చాట్: చాట్ మసాలా వేసుకుని సీజనల్ పండ్లు తింటే చాలా తేలికగా ఉంటుంది. ఒక చిన్న గిన్నెలోని ఫ్రూట్ చాట్లో 200 క్యాలరీల కంటే తక్కువగా ఉంటుంది, సహజ చక్కెరల నుండి కూడా శక్తి లభిస్తుంది.
ఉప్మా : తక్కువ నూనెతో చేసుకునే ఉప్మాలో దాదాపు 180 క్యాలరీలు ఉంటాయి. క్యాలరీలు పెరగకుండా ఉండడానికి ఎక్కువగా కూరగాయలు వేసి కూడా చేసుకోవచ్చు.
మజ్జిగ: వేయించిన జీలకర్రతో ఒక గ్లాస్ మజ్జిగలో దాదాపు 50 క్యాలరీలు మాత్రమే ఉంటాయి, ఇది జీర్ణప్రక్రియకు సహాయపడుతుంది. కడుపు నిండుగా ఉండాలంటే దీనితో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ బాదం లేదా వాల్‌నట్స్ తీసుకోవచ్చు.
మొక్కజొన్న: ఉడికించిన లేదా కాల్చిన మొక్కజొన్నకు కారం, నిమ్మరసం వేసుకొని తింటే ఫైబర్, మినరల్స్ ఎక్కువగా లభిస్తాయి. ఒక మొక్కజొన్నలో 150 క్యాలరీల కంటే తక్కువ ఉంటుంది.
అటుకులు: ఒక చిన్న గిన్నె నిండా అటుకులు కూరగాయలతో ఎక్కువ నూనె లేకుండా కలిపి తింటే 180-200 క్యాలరీలు వస్తాయి. తినడానికి తేలికగా ఉన్న కడుపు నిండినట్లు ఉంటుంది, ఇది రాత్రి భోజనానికి కూడా మంచి ఆహారం.
ఇప్పుడు మీరు సాయంత్రం సమయంలో ఆకలేస్తే చిరుతిళ్లు తినాలి అంటే భయపడాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో ఆరోగ్యకరమైన, తక్కువ క్యాలరీల స్నాక్స్ చాలా ఉన్నాయి. వీటితో మీరు 200 క్యాలరీలు దాటకుండా మీ ఆకలిని తీర్చుకోవచ్చు. ముఖ్యంగా ఏమిటంటే, మీరు తీసుకునే ఆహారం మోతాదు కంట్రోల్ చేయడం, వంటగదిలో మీ ఆహారంపై కాస్త తెలివితో ఆలోచించడం.