
ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివపురానికి చెందిన రైతు బేతెల్లి కుమార్(45) అంత్యక్రియలు గురువారం పోలీస్ బందోబస్తు మధ్య నిర్వహించారు. సర్కారు వడ్లు కొనకపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి కుమార్ విషం తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ట్రీట్ మెంట్ కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా బుధవారం మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం కుమార్మృతదేహాన్ని పోలీసులు దగ్గరుండి స్వగ్రామానికి తరలించారు. కుమార్ మృతదేహాన్ని చూడడానికి వచ్చే రైతులు, గ్రామస్తులు ధర్నా, రాస్తారోకోలు చేయకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. చిన్నబోయినపల్లి వద్ద వచ్చిపోయే వెహికల్స్‌ను తనిఖీ చేశారు. ముందస్తుగా బీజేపీ, రైతు సంఘం నాయకులను అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కుమార్ అంత్యక్రియలు ముగిశాక వారిని వదిలిపెట్టారు.