హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్రం కలిసి నడవాలని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో రాజకీయాలకు తావు లేదని సీఎం స్పష్టం చేశారు.
మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహకారంతో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారో, అదే తరహాలో నేడు తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకరించాలని కోరారు. 'రిఫార్మ్స్ ఎక్స్‌ప్రెస్'లో దూసుకుపోతున్న భారత్‌లో తెలంగాణ భాగస్వామ్యం కీలకమని ప్రధాని పేర్కొన్నారు.
వికసిత తెలంగాణతోనే వికసిత భారత్ సాధ్యమని, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి అనే మాటే ఉండదని చెప్పారు. తనతో కలిసి ఉండటమే తెలంగాణ ప్రయోజనాలకు మంచిదని, కేంద్రం అందజేసే సాయం వల్లే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
రాష్ట్రంలో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు హెచ్ఐసీసీ నుంచి వర్చువల్ గా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇందులో జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, పీఎం మిత్ర పార్క్ (వరంగల్), కాజీపేట–విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ బైపాస్ లైన్, ఇండియన్ ఆయిల్ టెర్మినల్ (మల్కాపూర్) ఇతర అభివృద్ధి పనులు ఉన్నాయి.
అభివృద్ధి ఉత్సవంలో భాగస్వామ్యం
దేశాభివృద్ధిలో తెలంగాణను భాగస్వామ్యం చేస్తూనే, రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టేందుకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా ప్రధానిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జాతీయ భద్రత, అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, ముందు దేశం, ఆపై ప్రజలు, చివరికే పార్టీ అనేది తమ విధానమని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047తో పాటు తెలంగాణ రైజింగ్ 2047ని అనుసంధానిస్తూ, దేశ ప్రగతిలో తాము కలిసి నడుస్తామన్నారు.
ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఇదొక అభివృద్ధి ఉత్సవం అని సీఎం అన్నారు. ఎన్నికలు ముగిశాయని, ఇక అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ప్రకటించిన ‘వికసిత్ భారత్ 2047’లో తెలంగాణ భాగస్వామ్యమవుతోందని, ‘తెలంగాణ రైజింగ్ 2047’ పేరుతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తామని వెల్లడించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం ఇందుకు నిదర్శనమన్నారు.
మన్మోహన్ స్ఫూర్తితో సహకరించండి
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహకారంతో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారో, అదే తరహాలో తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని సీఎం కోరారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలనేది తమ లక్ష్యమని, నాడు గుజరాత్ కు మన్మోహన్ సింగ్ ఆశీస్సులు అందించినట్లే, నేడు మోదీ ఆశీస్సులు తెలంగాణకు అవసరమని పేర్కొన్నారు.
దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ మహానగరాల అభివృద్ధి అత్యంత కీలకమని రేవంత్ పేర్కొన్నారు. ఈ నగరాల్లోని జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల అనుమతుల కోసం ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక ప్రత్యేక ‘సింగిల్ విండో టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సమీక్ష కోసం సమయం ఇవ్వండి
మూసీ నది సుందరీకరణ, మెట్రో రైలు విస్తరణ, రేడియల్ రోడ్లు, హైదరాబాద్-మచిలీపట్నం 12 వరుసల రహదారి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి అత్యవసర ఆమోదాలు అవసరమని రేవంత్ తెలిపారు. ఈ అంశాలపై చర్చించేందుకు కనీసం రెండు గంటల సమయం కేటాయించి సమీక్షించాలని ప్రధానిని కోరారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ప్రధానిది పెద్ద మనసు అని చెబుతున్నారని, మోదీ తెలంగాణపై పెద్ద మనసు చేసుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలన్నింటినీ ప్రధాని ఆమోదిస్తారని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047తో పాటు తెలంగాణ రైజింగ్ 2047ని అనుసంధానిస్తూ, దేశ ప్రగతిలో తాము కలిసి నడుస్తామన్నారు.
వరంగల్‌లో దేశంలోనే తొలి పీఎం మిత్ర పార్క్
వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో రూ. 1,700 కోట్ల వ్యయంతో నిర్మించిన 'పీఎం మిత్ర పార్కు'ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఇది దేశంలోనే తొలి పూర్తిస్థాయిలో పనిచేస్తున్న పీఎం మిత్ర పార్క్ కావడం విశేషం.
5 ఎఫ్ సూత్రంతో పనిచేసే ఈ కేంద్రం ద్వారా మహిళలకు భారీగా ఉపాధి లభించడమే కాకుండా, పీఎల్ఐ పథకం ద్వారా యూనిట్లకు కేంద్ర ప్రోత్సాహకాలు అందుతాయని చెప్పారు. వరంగల్ పీఎం మిత్ర పార్క్ దేశ టెక్స్‌టైల్ రంగానికి నూతన జవజీవాలు పోస్తుందని, పీఎల్ఐ పథకం ద్వారా మహిళలకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
రెట్టింపైన హైవేలు.. పెరిగిన రైల్వే బడ్జెట్
గత 11 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల నెట్‌వర్క్ రెట్టింపు అయిందని, దీనికోసం రూ. 1.75 లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టామని ప్రధాని తెలిపారు. 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైల్వే బడ్జెట్ వెయ్యి కోట్ల కంటే తక్కువగా ఉండేదని ఈ విషయం రేవంత్ రెడ్డి వింటున్నారా అంటూ వ్యాఖ్యానించారు.
ఇయ్యాల కేవలం తెలంగాణకే సుమారు రూ. 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించి, రూ. 30,000 కోట్ల విలువైన పనులు చేపడుతున్నామని వివరించారు. కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్‌తో పాటు, రాష్ట్రంలో ఐదు వందే భారత్, ఆరు అమృత్ భారత్ రైళ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని గుర్తుచేశారు.
ఇంధన భద్రతలో భారత్ ముందంజ
ఇంధన భద్రతే లక్ష్యంగా మల్కాపూర్‌లో ఇండియన్ ఆయిల్ టెర్మినల్ ప్రారంభించామని, ఇది రాష్ట్ర ఇంధన సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తుందని ప్రధాని తెలిపారు. సౌరశక్తి, ఇథనాల్ బ్లెండింగ్, సీఎన్‌జీ వినియోగంపై చేపట్టిన చర్యలతో భారత్ అంతర్జాతీయ ఇంధన సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటోందని చెప్పారు. దిగుమతి చేసుకునే ఇంధనాన్ని పొదుపుగా వాడి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సింధు హాస్పిటల్ ప్రారంభించిన మోదీ
హైదరాబాద్ లో సింధు హాస్పిటల్ ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు పెంచడానికి ఇది ఒక మంచి ప్రయత్నం అని ఆయన అన్నారు. ఆసుపత్రిలో అత్యాధునిక టెక్నాలజీని, కొత్త పద్ధతులను వాడుతుండటంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు. ‘‘హైదరాబాద్ లో సింధు ఆసుపత్రిని ప్రారంభించాను. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఆసుపత్రి టీమ్ ప్రయత్నం చాలా బాగుంది. కొత్త టెక్నాలజీకి వారు ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయం’’ అని ప్రధాని పేర్కొన్నారు.
నాతో కలిసి ఉండటమే తెలంగాణకు మంచిది
తెలంగాణను దేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్‌గా మార్చే లక్ష్యంతో కేంద్రం భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 'రిఫార్మ్స్ ఎక్స్‌ప్రెస్'లో దూసుకుపోతున్న భారత్‌లో తెలంగాణ భాగ స్వామ్యం కీలకమన్నారు. వికసిత తెలంగాణ తోనే వికసిత భారత్ సాధ్యమని, రాజకీయా లకు అతీతంగా రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉండటం సహజమని, అయితే దేశాభివృద్ధికి రాష్ట్రాల పురోగతి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రస్తావించిన రాజకీయ రహిత అంశంపై స్పందిస్తూ, "10 ఏళ్ల పాలనలో గుజరాత్‌కు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి సిద్ధం. కానీ, నేను అలా చేస్తే మీకు ఇప్పుడు అందుతున్న సాయం సగానికి తగ్గిపోతుంది" అని వ్యాఖ్యానించా రు.
తనతో కలిసి ఉండటమే తెలంగాణ ప్రయోజనాలకు మంచిదని, కేంద్రం అందజేసే సాయం వల్లే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. 2047 నాటికి 'వికసిత భారత్' కల సాకారం చేసేందుకు తెలంగాణలోని ప్రతి కుటుంబానికి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు.
జాతీయ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతాన్ని 'ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ'గా తీర్చిదిద్దుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులు, అడ్వాన్స్‌డ్ ఐసీటీ నెట్‌వర్క్, నిరంతర విద్యుత్‌తో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.
