కాంగ్రెస్ విధానాలు దేశానికి డేంజర్: ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్

కాంగ్రెస్ విధానాలు దేశానికి డేంజర్: ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్
  • అధికారం కోసం ఆ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని విమర్శ

గువాహటి: అస్సాం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పార్టీ తీసుకురావాలని చూసిన ‘కమ్యూనల్ వయలెన్స్ లా’ పై ఆయన మండిపడ్డారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధేమాజీ జిల్లాలోని గోగాముఖ్‌‌‌‌లో  జరిగిన  బహిరంగ సభలో ప్రధాని మోదీ  ప్రసంగించారు. ‘‘2014 ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం మతపరమైన హింస నిరోధక చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నించింది. 

ఆ బిల్లు ప్రకారం అల్లర్లకు మెజారిటీ వర్గమే బాధ్యత వహించాలని, మైనారిటీలు ఎప్పుడూ బాధితులేనని పేర్కొన్నారు. ఆ బిల్లే అత్యంత వివక్షపూరితమైనది. అందుకే బీజేపీ నేతృత్వంలోని -ఎన్డీయే కూటమి దానిని అడ్డుకుంది. ఇప్పుడు 12 ఏండ్ల తర్వాత, అస్సాంలో కాంగ్రెస్ పార్టీ  మళ్లీ అదే తరహా చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించడం చూస్తుంటే, అధికారం కోసం వారు ఎంతకైనా తెగిస్తారని అర్థమవుతున్నది’’ అని పేర్కొన్నారు. బిశ్వనాథ్‌‌‌‌లోని బెహాలీలో జరిగిన మరో సభలో కూడా ప్రధాని మాట్లాడారు. మహిళల గౌరవం, భద్రత కోసం తమ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. అస్సాంలో యూసీసీ అమలు, గిరిజన సంప్రదాయాల రక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

టీ తోటలో ప్రధాని  మోదీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దిబ్రూగఢ్ జిల్లాలోని ఒక టీ తోటను సందర్శించారు. ప్రచార హడావుడిలో ఉన్నప్పటికీ, కాసేపు రాజకీయాలను పక్కనపెట్టి ప్రకృతి ఒడిలో గడిపారు. మనోహరి టీ ఎస్టేట్‌‌‌‌ను సందర్శించిన ప్రధాని అక్కడి19 మంది మహిళా కార్మికులతో కలిసి తేయాకును కోశారు. దాదాపు అరగంట పాటు కార్మికులతో గడిపిన మోదీ వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. 

వారితో సెల్ఫీలు దిగారు. వారి శ్రమను ఆయన కొనియాడారు. ‘‘ప్రతి టీ గార్డెన్ కుటుంబం చేస్తున్న కృషితో మేమెంతో గర్విస్తున్నాం. వారి కష్టం, పట్టుదల అస్సాం ప్రతిష్టను మరింత పెంచాయి.  తేయాకు కోయడం పూర్తయ్యాక వారు తమ సంస్కృతి గురిం చి ముచ్చటించారు. ఆపై ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాం’’ అని మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.