భద్రాచలం పట్టణ ప్రజలకు కరకట్టల భయం

భద్రాచలం పట్టణ ప్రజలకు కరకట్టల భయం
  •   60 అడుగులు దాటిన ప్రవాహం
  •      దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
  •      144 సెక్షన్  విధింపు, 48 గంటల పాటు భద్రాచలం వంతెన మూసివేత

భద్రాచలం,వెలుగు:గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలం పట్టణంతో పాటు మన్యం వణుకుతోంది. గురువారం రాత్రి 9 గంటలకు 63.20 అడుగులకు వరద చేరుకుంది. గోదావరి చరిత్రలో ఏడోసారి 60 అడుగులు దాటింది. ఎగువ ప్రాంతంలోని రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో 70 అడుగులకు వరద చేరుకుంటుందని కలెక్టర్ అనుదీప్  తెలిపారు. గోదావరి ఉధృతి కారణంగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రాచలంలో గోదావరి కరకట్టపైకి సందర్శకులు వస్తుండడంతో వారిని కట్టడి చేసేందుకు భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గోదావరి బ్రిడ్జిపై గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటల పాటు రాకపోకలను నిషేధించారు. సీఆర్పీఎఫ్ బలగాలతో బ్రిడ్జికి రెండు వైపులా బందోబస్తు ఏర్పాటు చేశారు. దుమ్ముగూడెం, చర్ల  మండలాలకు వెళ్లే విద్యుత్ స్తంభాలు నీట మునగడంతో ఆ రెండు మండలాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పర్ణశాల సబ్​స్టేషన్​ను గోదావరి వరద చుట్టుముట్టింది. 

పడవల్లో తరలింపు

గోదావరి తీర ప్రాంతంలోని ప్రజలను పడవల్లో రీహాబిటేషన్ సెంటర్లకు తరలిస్తున్నారు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం, కొత్తగూడెం మండలాల్లో 61 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి.  దీంతో 2807 కుటుంబాలకు చెందిన 9846 మందిని 48 రీహాబిటేషన్ సెంటర్లకు తరలించారు. 

కరకట్టల భయం

భద్రాచలం పట్టణ ప్రజలకు కరకట్టల భయం పట్టుకుంది. వరదను ఎంత వరకు తట్టుకుంటాయోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2000లో కరకట్టలను నిర్మించగా, మెయింటెనెన్స్​ అధ్వానంగా ఉండడంతో ఎలుకలు, పందికొక్కులు కట్టలను ధ్వంసం చేశాయి. మరోవైపు కూనవరం రోడ్డు వైపు ఉన్న కరకట్ట కింద నుంచి రైతులు పైపులు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పట్టణంలోకి నీళ్లు వస్తున్నాయి. వరద70 అడుగులకు చేరుకుంటే కరకట్టలను ప్రవాహం తాకుతుంది. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని బాధితులు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లి ఆవేదన వ్యక్తం చేశారు. 

వరుణ, ఇంద్ర, గాయత్రి జప యాగాలు

గోదావరి వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం వరుణ, ఇంద్ర, గాయత్రి జపయాగాలు నిర్వహించారు. ఎండోమెంట్​ కమిషనర్​ ఆదేశాల మేరకు ఈవో శివాజీ అతి వర్ష భయ నివారణకు వేదపండితులు, అర్చకులతో లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో జపాలు చేపట్టారు. 

పునరావాస కేంద్రాల సందర్శన..

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ గురువారం భద్రాచలంలోని పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఆర్​అండ్​బీ ఆఫీస్, నన్నపనేని మోహన్​ స్కూల్, సమ్మక్క సారక్క ఫంక్షన్​హాల్​లోని ఛత్తీస్​గఢ్, ఒడిశా రాష్ట్రాల బాధితులను ఆయన పరామర్శించారు. వారిలో ధైర్యం నింపారు. అనంతరం గోదావరికి పూజలు చేశారు. 

గురుకుల కాలేజీ స్టూడెంట్ల తరలింపు

భద్రాచలం టౌన్​లోని చర్ల రోడ్డులో ఉన్న గిరిజన గురుకుల బాలికల కాలేజీని ఐటీడీఏ పీవో గౌతమ్​ పోట్రు గురువారం తనిఖీ చేశారు. కాలేజీ వెనుక భాగంలోకి వరద నీరు వచ్చే ప్రమాదం ఉందని గుర్తించి స్టూడెంట్స్​ను తరలించాలని ఏపీవో జనరల్ డేవిడ్​రాజును ఆదేశించారు. ఆర్ఓఎఫ్ఆర్​ డీటీ శ్రీనివాసరావుతో కలిసి లారీల్లో స్టూడెంట్లను వైటీసీకి తరలించారు. అంతకుముందు భద్రాచలంలో చిక్కుకున్న ఛత్తీస్​గఢ్, ఒడిశాలకు చెందిన 300 మంది గిరిజనులను సమ్మక్క సారక్క భవనానికి తరలించి భోజన వసతి ఏర్పాటు చేశారు. 

అప్రమత్తంగా ఉన్నాం

వరదలను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉన్నామని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ చెప్పారు. భద్రాచలంలో మకాం వేసిన ఆయన గురువారం కరకట్ట, విస్తా కాంప్లెక్స్, పునరావాస కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ముందస్తు చర్యలతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ముంపు గ్రామాల చుట్టూ పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్​ అనుదీప్​, ఎస్పీ వినీత్, ఇరిగేషన్​ సీఈ శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, డా.తెల్లం 
వెంకట్రావ్​ ఉన్నారు. 

నీట మునిగిన గ్రామాలు

పినపాక: గోదావరి నదికి వరద పోటెత్తడంతో పినపాక మండలంలోని టి.కొత్తగూడెం, భూపతిరావుపేట, చింతలబయ్యారం, రావిగూడెం, వలస ఆదివాసీల గ్రామం సుందరయ్యనగర్​ వరద ముంపుకు గురయ్యాయి. అప్రమత్తమైన తహసీల్దార్​ కె.విక్రమ్​కుమార్​ ఆధ్వర్యంలో 350 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. సింగిరెడ్డిపల్లి, టి.కొత్తగూడెం, రావిగూడెం గ్రామాల్లో వరిపొలాలు, కూరగాయల తోటలు నీట మునిగాయి. అత్యవసరమైతే వినియోగించేందుకు నాటుపడవలు, మెషిన్​బోట్లు సిద్దంగా ఉంచినట్లు తహసీల్దార్​ తెలిపారు.